TS: ఉద్యోగుల ధర్నా.. ఏ క్షణంలోనైనా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Power Outage Likely As Employees Boycott Duties Protest Against Electricity Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్‌ ఉద్యోగులు నల్లరంగు చొక్కాలు ధరించి మహా ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. నూతన విద్యుత్‌ బిల్లు ద్వారా విద్యుత్‌శాఖ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్‌ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్తా మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేపట్టారు.

చట్టసవరణ బిల్లు ప్రవేశ పెడితే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనతో తెలంగాణలో ఏ క్షణంలోనైనా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనని విద్యుత్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ఎవరు విధుల్లో ఉండరని ప్రకటించిన ఉద్యోగులు.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు.
చదవండి: Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top