విద్యుత్‌  వివాదం వీడింది! | Power Dispute End Between Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

విద్యుత్‌  వివాదం వీడింది!

Dec 19 2020 1:51 AM | Updated on Dec 19 2020 9:21 AM

Power Dispute End Between Andhra Pradesh And Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీకి 655 మంది ఉద్యోగులు వెళ్తుండగా ఏపీ నుంచి తెలంగాణకు సైతం సమాన సంఖ్యలో ఉద్యోగులు రావాలని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ డి.ఎం. ధర్మాధికారి ఏకసభ్య కమిటీ గతేడాది నవంబర్‌లో తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తీర్పునివ్వడంతో ఆ మేరకు ఏపీ, తెలంగాణ జెన్‌కోలు, ట్రాన్స్‌కోల మధ్య ఉద్యోగుల పరస్పర కేటాయింపులపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు 252 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేయడంతోపాటు ఏపీ జెన్‌కో నుంచి 252 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు 300 మందిని కేటాయించాలని, అంతే సంఖ్యలో ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ జెన్‌కోకు తీసుకోవాలని ధర్మాధికారి కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే వారిలో రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని తుది కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరింది. దీంతో తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ జెన్‌కోకు వెళ్లే వారిలో 48 మంది రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండటంతో వారిని మినహాయించి మిగిలిన 252 మందిని ఏపీ జెన్‌కోకు కేటాయించింది.

తెలంగాణ ట్రాన్స్‌కోకు..
ఇక తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి ఏపీ ట్రాన్స్‌కోకు 173 మంది ఉద్యోగులను ధర్మాధికారి తుది నివేదికలో కేటాయించగా, అంతే సంఖ్యలో ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన 173 మందిలో 39 మంది పదవీ విరమణకు సమీపంలో ఉండటంతో వారిని నిబంధనల ప్రకారం కేటాయింపు నుంచి మినహాయింపునిచ్చారు. తుదకు తెలంగాణ నుంచి ఏపీకు 134 మందిని రిలీవ్‌ చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు ఇప్పటికే 30 మంది ఉద్యోగులు వచ్చి చేరడంతో మిగిలిన 104 మంది ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్‌కోలో చేర్చుకుంటున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement