Telangana Power Companies Crisis: జీతాలకూ కష్టమే..!

Power Companies Crisis In Telangana Several Crores Burden Of Debt - Sakshi

విద్యుత్‌ సంస్థల్లో తీవ్రమైన సంక్షోభం

విద్యుత్‌ ప్లాంట్ల రుణాలు మళ్లించి ఏడాదిగా జీతాల చెల్లింపులు

తాజాగా ఎత్తిపోతల పథకాల ఆస్తులు తాకట్టు పెట్టి రూ.700 కోట్ల రుణం

ఎట్టకేలకు నేడు ఖాతాల్లో పడనున్న జీతాలు 

రూ.90వేల కోట్లకు పైగా అప్పుల భారం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారింది. సొంతంగా విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి. రాష్ట్రంలో కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ)విడుదల చేస్తున్న రుణాలను ప్రతినెలా జీతాల కోసం మళ్లిస్తున్నాయి. మిగిలిన మొత్తం కోసం ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. గత రెండు నెలలుగా రుణాల చెల్లింపులను ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ నిలుపుదల చేయడంతో.. ఒక్కసారిగా ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో చిక్కుకున్నాయి.

తాజాగా ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ఇతర ఎలక్ట్రికల్‌ ఆస్తులను తనఖా పెట్టి ఓ బ్యాంకు నుంచి రూ.700 కోట్ల రుణాన్ని తీసుకుంటుండటంతో సోమవారం నాటికి విద్యుత్‌ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 25వేల మంది ఉద్యోగులు, మరో 22 వేల మంది ఆర్టిజన్లు ఉన్నారు. వీరి జీతాలకు ప్రతినెలా రూ.650 కోట్లు అవుతోంది.

 గతి లేక దారిమళ్లింపు
రాష్ట్రంలో కొత్తగా 1080 మెగావాట్ల యాదాద్రి, 4వేల మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలతో తెలంగాణ జెన్‌కో రుణ ఒప్పందం చేసుకుంది. ప్రతినెలా రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల పనులు జరుగుతుండగా, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు ఆ మేరకు రుణాలను ప్రతి నెలా చివరి రోజు జెన్‌కో ఖాతాలో జమ చేస్తున్నాయి.

జీతాలకు రూ.650 కోట్లు అవసరం కాగా, ప్రతి నెలా రూ.300 కోట్ల రుణాలను మళ్లిస్తున్నారు. మిగిలిన మొత్తం కోసం వినియోగదారులు చెల్లించే బిల్లులతోపాటు బ్యాంకు రుణాలపై విద్యుత్‌ సంస్థలు ఆధారపడుతున్నాయి. ఇప్పటికే అధిక శాతం ఆస్తులు తనఖా కింద పోగా, మిగిలిన ఆస్తులపై కొత్త రుణాల కోసం ఆధారపడుతున్నాయి.

అప్పుల కుప్ప
విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.30వేల కోట్లకు పెరిగిపోయాయి. ఎన్టీపీసీ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ కేంద్రాలకు రూ.12 వేల కోట్లు, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రూ.6వేల కోట్లు, సౌర విద్యుత్‌ అమ్మకందారులకు రూ.6వేల కోట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌కు రూ.3వేల కోట్లు, సెంబ్‌ కార్ప్‌ సంస్థకు రూ.2,600 కోట్లను చెల్లించాల్సి ఉంది.

బకాయిలను చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తామని ఎన్టీపీసీ పలుమార్లు రాష్ట్రాన్ని హెచ్చరించింది. తెలంగాణ వచ్చాక ఏకంగా రూ.34వేల కోట్ల రుణాలతో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకున్నారు. యాదాద్రి, భద్రాద్రి, ఇతర విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు జెన్‌కో రూ.45 వేల కోట్ల అప్పులు చేసింది. 

పేరుకుపోతున్న నష్టాలు 
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాకు ప్రతి నెలా రూ.1,200 కోట్ల చొప్పున ఏడాదికి రూ.14,200 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, ఇప్పటివరకు ప్రభుత్వం రూ.5,600 కోట్ల సబ్సిడీలను మాత్రమే చెల్లించింది. క్రాస్‌ సబ్సిడీలు సర్దుబాటు చేశాక డిస్కంలు ఏటా రూ.5 వేల కోట్ల వరకు నష్టాల్లో మునిగిపోతున్నాయి. 2021–22 ముగిసే నాటికి నష్టాలు రూ.60 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. సమీప భవిష్యత్తులో విద్యుత్‌ సంస్థల అప్పులు రూ.లక్ష కోట్లకు చేరుకోనున్నాయి. వడ్డీల చెల్లింపులు చేయలేక విద్యుత్‌ సంస్థలు సతమతమవుతున్నాయి.

సర్కారీ బకాయిలే గుదిబండ
గత ఫిబ్రవరి ముగిసే నాటికి డిస్కంలకు రూ.17,202.15 కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిలు రావాల్సి ఉండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సినవే రూ.12,598.73 కోట్లు కాగా, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి రూ.4,603.41 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం బకాయిపడిన రూ.12వేల కోట్లను చెల్లిస్తే విద్యుత్‌ సంస్థలు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top