
రెండో సిలిండర్ వచ్చిన జమ కాని నగదు
కొందరు లబ్ధిదారులకు తప్పని నిరాశ
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పేద కుటుంబాల అసహనం
‘హైదరాబాద్ నగర శివారులోని మౌలాలీకి చెందిన బాలకృష్ణ కుటుంబం రూ.500 గ్యాస్ సిలిండర్ వర్తింపునకు అర్హత సాధించింది. రీఫిల్ డోర్ డెలివరీ కాగానే మార్చి నెల వరకు ఠంచన్‌గా బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నగదు జమ అవుతూ వచ్చింది. కాగా.. మార్చి నుంచి రెండు పర్యాయాలు సిలిండర్ బుక్ చేస్తే .. రీఫిల్ డోర్ డెలివరీ అయింది కానీ సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. బాలకృష్ణ కుటుంబానికే ఎదురైన సమస్య కాదు.. గ్రేటర్ పరిధిలో గ్యాస్ సబ్సిడీకి అర్హత సాధించిన చాలా కుటుంబాలదీ ఇదే పరిస్థితి’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద రూ.500కు వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ మూణ్నాళ్ల ముచ్చటగానే తయారైంది. గ్యాస్ సబ్సిడీకి అర్హత సాధించి రీఫిల్ డోర్ డెలివరీ కాగానే సబ్సిడీ నగదు రూపంలో కొన్ని నెలలు బ్యాంక్ ఖాతాలో జమ అయినా.. ఆ తర్వాత ఆగిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో కేవలం కేంద్ర ప్రభుత్వ స్లాబ్ సబ్సిడీకి పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
మూడు లక్షల కుటుంబాలకు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం కింద రూ. 500 కు వంట గ్యాస్ వర్తింపునకు కేవలం మూడు లక్షల కుటుంబాలు మాత్రమే అర్హత సాధించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 40.18 లక్షల ఎల్పీజీ కనెక్షన్‌దారులున్నారు. ప్రజాపాలనలో సుమారు 24.74 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 19.10 లక్షల కుటుంబాలకు మాత్రమే తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం కేవలం మూడు లక్షలలోపు కనెక్షన్‌దారులకు మాత్రమే వర్తించినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా 16 లక్షల కనెక్షన్‌దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా మారింది. తాజాగా అర్హత సాధించిన కుటుంబాల్లో సైతం కొందరికి సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమకావడం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది.
కొందరి ఖాతాల్లోనే నగదు జమ..
రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోవడంతో మళ్లీ వంట గ్యాస్ ఆర్థిక భారంగా తయారవుతోంది. మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై సబ్సిడీ రూపంలో రూ.40.71 జమ చేస్తోంది. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబి్ధదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగతా సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ వస్తోంది. తాజాగా సిలిండర్‌పై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. మిగతా వారికి జమ కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల్లో కొరవడిన స్పష్టత..
వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింప జేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబి్ధదారుల సిలిండర్ సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికీ.. గతంలో వినియోగించిన సంఖ్య తక్కువగా ఉంటే దాని ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం.