
స్పాన్సర్‌షిప్స్ విషయంలో అధికారుల తప్పటడుగులు
ఖర్చును మించి ఆదాయం వచ్చేలా ఉన్నా అస్తవ్యస్తం
పర్యాటక శాఖ ఉన్నతాధికారుల మధ్య కీచులాటలు
పోటీదారుల కాళ్లు కడిగించటంపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలను ఘనంగా నిర్వహించి చూపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంటే, ఆ పనిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు మాత్రం కీచులాటలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి చివరకు ప్రభుత్వానికే తలవంపులు తెచ్చేలా మారింది. ఈ పోటీల నిర్వహణలో ప్రధాన భూమిక పర్యాటక శాఖదే. అందులో అంతర్భాగమైన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ఈడీ స్థాయి అధికారిని పోటీలు కొనసాగుతుండగానే మాతృ సంస్థకు పంపటం వెనుక అధికారుల మధ్య వివాదాలే కారణమన్న చర్చ జరుగుతోంది.
స్పాన్సర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్..
పోటీల నిర్వహణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం–మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా చెరిసగం భరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్వహణ ఖర్చుల అంచనా రూ.57 కోట్లని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.25 కోట్లను మించి స్పాన్సర్‌షిప్ మొత్తం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయని సమాచారం. పోటీలు ప్రారంభం కాకముందే స్పాన్సర్‌గా ఉండేందుకు ఓ పెద్ద బ్యాంకు ముందుకొచి్చ, ప్రభుత్వం ఆశించిన మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఒక్క బ్యాంకుకే మొత్తం స్పాన్సర్‌షిప్ ఇవ్వలేమని, మరికొన్ని సంస్థలతో కలిపి ఇస్తామని ఓ ఉన్నతాధికారి ఆ బ్యాంకు ప్రతినిధులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం.
ఆ తర్వాత కొన్ని సంస్థలు ముందుకొచి్చనా.. వాటితో ఓ ఉన్నతాధికారి సరిగా వ్యవహరించకపోవటంతో అవి కూడా వెనుదిరిగాయని చెబుతున్నారు. సదరు సంస్థలతో అధికారులు సరిగా డీల్ చేసి ఉంటే ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన మొత్తానికి మించి ఆదాయం సమకూరి ఉండేదని అంటున్నారు. మరోవైపు ఒకరిద్దరు అధికారులు ఈ స్పాన్సర్‌షిప్ వ్యవహారాన్ని సొంత లబి్ధకి వాడే ప్రయత్నం చేశారని, దానిపై విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వెరసి కీలక స్పాన్సర్‌షిప్స్ వ్యవహారంలో యంత్రాంగం వైఫల్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారుల మధ్య కీచులాటలు..
ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లను ప్రారంభంలో అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యవేక్షించారు. ప్రభుత్వం ఆమెను బదిలీ చేసి ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు అప్పగించింది. ఆ సమయంలో సీఎంతో జరిగిన ఓ సమావేశంలోనే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం మొదలైనట్లు తెలిసింది. ఈ పోటీల్లోని కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను కూడా అనుమతించాలని ఆ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదించారు. అప్పుడే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయేశ్‌రంజన్‌కు దీనిపై సమాచారం లేదు.
చివరకు కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇంతటి కీలక నిర్ణయం తనకు తెలియకుండా తీసుకోవటమేంటని ప్రకాశ్‌రెడ్డిని జయేశ్‌రంజన్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటన ఆ ఇద్దరు అధికారుల మధ్య కొంత అగాధానికి కారణమైందని పర్యాటక శాఖలో ప్రచారం జరుగుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, ఈడీ విజయ్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే విజయ్‌ని ఉన్నఫలంగా మాతృసంస్థకు పంపారని అంటున్నారు.
కాళ్లు కడిగించారనే అపవాదు..
ఇటీవల వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఆలయాల్లోకి వెళ్లేముందు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘట్టం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అక్కడ సాధారణ భక్తులు కాళ్లు కడుక్కున్నట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంటే సరిపోయేది. కానీ, పోటీదారులను కుర్చిల్లో కూర్చోబెట్టి కాళ్ల కింద కొత్త పళ్లాలు ఉంచి, చెంబులతో నీళ్లు పోసి సిబ్బందితో కాళ్లు కడిగించారు. కొందరు సిబ్బంది టవల్‌తో కాళ్లను తుడిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసలు ఇలా పళ్లాల్లో కాళ్లుంచి కడిగించే ఆలోచన ఎవరు చేశారంటూ తర్వాత పర్యాటక శాఖ మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.