Krishnam Raju: రాజకీయాల్లో పడిలేచిన కెరటం!

Political Life Of Tollywood Rebel Star Krishnam Raju - Sakshi

1998లో కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కృష్ణంరాజు 

వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా అవకాశం 

2009 వరకు రాజకీయాల్లో యాక్టివ్‌ 

కొంత విరామం తర్వాత 2014లో బీజేపీలోకి.. 

గవర్నర్‌ గిరీ వస్తుందనుకున్నా.. అనారోగ్యంతో రాజకీయాలకు దూరం  

సాక్షి, హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. సినిమాలతో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు అయ్యారు. 1991లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు చేతిలో ఓటమి చవిచూశారు. కొంతకాలం సినిమాలపైనే దృష్టిపెట్టిన ఆయన 1998లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ లోక్‌సభ రద్దయి 1999లో మధ్యంతర ఎన్నికలు జరగడంతో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి కనుమూరు బాపిరాజుపై గెలుపొందారు.

రెండోసారి లోక్‌సభలోకి అడుగుపెట్టిన ఆయన కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1999–2000 మధ్య లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కమిటీ సభ్యుడిగా, 2000లో కేంద్ర వాణిజ్య శాఖ సలహాకమిటీ సభ్యుడిగా పనిచేశారు. తొలిసారిగా 2000 సెప్టెంబర్‌ 30న వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, అప్పటి నుంచి 2002 జూన్‌ 20 వరకు రక్షణశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇదే ఏడాది జూలై 1న వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. 

కలిసి రాని సెకండ్‌ ఇన్నింగ్స్‌ 
2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసిన కృష్ణంరాజు.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేగొండి హరిరామజోగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత ఐదేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై రాజమండ్రి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. కొంతకాలం రాజకీయాలకు దూరం పాటించారు. మళ్లీ 2014లో బీజేపీలో చేరి కొంత యాక్టివ్‌గా పనిచేశారు. ఈ సమయంలో కృష్ణంరాజుకు గవర్నర్‌ పదవి రాబోతున్నదనే ప్రచారం జరిగింది. కానీ ఆరోగ్యం సహకరించలేదు. బీజేపీలోనే కొనసాగినా యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరమయ్యారు.

ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top