Munugode: ఉప ఎన్నిక ముగిసినా చల్లారని వేడి | Political Heat Continue at Munugode After By Poll Ended | Sakshi
Sakshi News home page

Munugode: అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ Vs సమస్యలపై బీజేపీ

Nov 16 2022 2:37 PM | Updated on Nov 16 2022 8:31 PM

Political Heat Continue at Munugode After By Poll Ended - Sakshi

మునుగోడు చౌరస్తా 

సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ చెబుతున్నా.. కార్యాచరణ మాత్రం ఆ దిశాగానే సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, ఇప్పుడు ఆ వేడి చల్లారకుండా టీఆర్‌ఎస్, బీజేపీలు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా పోరాడిన పార్టీలు ఆ తర్వాత కూడా తగ్గేదేలేదు అన్నట్లు కార్యక్రమాలు చేపడుతున్నాయి. బలం పెంచుకునే దిశగా ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి.

మునుగోడులో గెలుపుతో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయోత్సవాలతోపాటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీజేపీ పోరాటానికి దిగింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ క్షేత్ర స్థాయిలో వెళ్లాలని దిశా నిర్దేశం చేయడం కూడా ఆ సంకేతాలనే ఇస్తుంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కోసం జిల్లా కోర్‌ కమిటీని, నియోజకవర్గ కన్వీనర్లను కూడా నియమించడం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో పడింది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఎన్నికలకు ముందే ఆయా శాఖల వారీగా ప్రభుత్వం గుర్తించింది. ఉప ఎన్నికల సమయంలో ప్రజలు నేతల దృష్టికి తీసుకొచ్చిన  సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు విన్నవించారు. త్వరలోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటిపై త్వరలో నిర్వహించబోయే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించేందుకు సిద్ధం అవుతోంది. ప్రధానంగా రోడ్లు, కాలేజీలు, చండూరును రెవెన్యూ డివిజన్‌ చేయడం తదితర సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు దృష్టిపెట్టారు. ఇక సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉన్నా ముందస్తు వస్తే ఎలా ముందుకు సాగాలన్న అంశంపై టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు జిల్లాలో మరింత అభివృద్ధిపై దృష్టి సారించింది.

సమస్యలే ఎజెండాగా..
ఉప ఎన్నికలో ఓటమిపాలైనా.. అధిక ఓట్లు సాధించిన బీజేపీ మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే మునుగోడులో ప్రజ సమస్యలపై దృష్టిపెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప వాటిని పరిష్కరించలేదంటూ బీజేపీ నుంచి పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గొల్ల కురుమలకు వచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం మునుగోడులో ధర్నా చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం కొనసాగిస్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. «ఇలా ముందస్తు నేపథ్యంలో అధికార పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించగా బీజేపీ మాత్రం ప్రజాసమస్యలపై కార్యచరణ ప్రారంభించింది.   


మునుగోడులో ఇరు పార్టీల పోటాపోటీ కార్యాచరణ

Advertisement
 
Advertisement
Advertisement