హెచ్‌సీఏ ఫెయిల్యూర్‌.. జింఖానా గ్రౌండ్‌ తొక్కిసలాటపై పోలీసుల సీరియస్‌

Police Serious On HCA Over Gymkhana Ground stampede - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్‌సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. 

ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్‌ సీపీ చౌహాన్‌ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్‌ జోన్‌ అడిషనల్‌ సీపీ చౌహాన్‌ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్‌లో లైన్‌లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్‌కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

మరోవైపు ఈ పరిస్థితికి హెచ్‌సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్‌ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. 

టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నా హెచ్‌సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్‌సీఏ.. తర్వాత ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్‌సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ  వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top