వైరల్‌: కానిస్టేబుల్‌ మానవత్వం.. సలామ్‌ కొడుతున్న నెటిజన్లు

A Police Constable Offers Food To Homeless Children In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: కరోనా వేళ పోలీసులు ఎనలేని సేవలందిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి పగలు, రాత్రి పని చేస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కోవిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా పంజాగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేశ్‌కుమార్ మానవత్వానికి సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కానిస్టేబుల్‌​ మహేశ్‌ ఆదివారం రాత్రి 11గంటకు సోమాజిగూడ‌లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో రోడ్డుపక్కన ఇద్దరు చిన్నారులు ఆహారం కోసం యాచించడం చూసి చలించిపోయాడు. తన కోసం తెచ్చుకున్న క్యారేజీని స్వయంగా ఆ చిన్నారుల వడ్డించి వారి ఆకలి తీర్చాడు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను హైద‌రాబాద్ సిటీ పోలీసులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 1.65 లక్షల మంది వీక్షించగా.. వేల మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో చూసిన ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘నేను ఆయనకు వందనం చేస్తున్నాను. అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలియజేయండి. కరోనా తర్వాత కలిసి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుతా. అతడికి దేవుడి ఆశీర్వాదం ఉంటుంది’ అని కామెంట్‌ చేశాడు. ‘సలామ్‌ పోలీసు కానిస్టేబుల్‌! మీరు మానవత్వం చాటుకున్నారు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

(చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ షూటింగ్‌: అడ్డుకున్న పోలీసులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top