
లొంగిపోయిన ద్రోహులే నంబాల సమాచారం ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బీఆర్ దాదాను పోలీసులు సజీవంగానే పట్టుకుని కాల్చిచంపినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. లొంగిపోయిన కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా, అబూజ్‌మఢ్ ప్రాంతంలో ఈనెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో విజయం సాధించగల్గినట్టు పేర్కొంది.
నంబాల సహా ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. ప్రాణాలను త్యాగం చేసిన వారికి మావోయిస్టు పార్టీ నివాళులు అర్పిస్తోందని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట మూడు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఎన్‌కౌంటర్ జరగడానికి దారి తీసిన పరిస్థితులు, ఎన్‌కౌంటర్ ముందు నంబాల పార్టీ కేడర్‌కు ఇచ్చిన సందేశం తదితర అంశాలను కూలంకశంగా అందులో పేర్కొన్నారు. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం...
ద్రోహుల సమాచారంతోనే...:
కామ్రేడ్ బీఆర్ దాదా మాడ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం పోలీసు నిఘా విభాగానికి ఉంది. గత ఆరునెలల్లో ఈ ప్రాంతంలోని వివిధ యూనిట్ల నుంచి కొంతమంది బలహీనపడి పోలీసు అధికారుల ముందు లొంగిపోయి దేశద్రోహులుగా మారారు. మా రహస్య వార్తలు ఈ ద్రోహులే పోలీసులకు నిరంతరం చేరవేశారు. దాదాను లక్ష్యంగా చేసుకుని జనవరి, మార్చి నెలల్లో రెండుసార్లు దాడికి ప్రయత్నించినా అవి విజయవంతం కాలేదు. గత ఒకటిన్నర నెలల్లో దాదా భద్రతలో ప్రధాన బాధ్యత పోషించిన సీపీ వైపీసీ సభ్యుడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా ఉద్యమద్రోహిగా మారాడు. ఈ వ్యక్తుల కారణంగానే పెద్ద నష్టాన్ని భరించాల్సి వచ్చింది.
60 గంటలు తిండిలేకుండానే పోరాటం
మే 17, 18 తేదీల్లో నారాయణపూర్, కోడ్గావ్‌లో డీఆర్‌జీ బలగాల మోహరింపు ఓర్చా వైపు నుంచి ప్రారంభమైంది. మే 19 ఉదయం 9 గంటలకు వారు మా యూనిట్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందిన విషయం తెలిసిన వెంటనే మేం అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఎన్‌కౌంటర్ జరిగింది. 35 మంది విప్లవకారులకు 60 గంటలుగా తినడానికి, తాగడానికి ఏమీ దొరకలేదు. అయినా, మా సహచరులు దాదాను తమ మధ్యే సురక్షిత ప్రదేశంలో ఉంచుకుని ప్రతిఘటించారు. మొదట రావూరులో డీఆర్‌జీకి చెందిన కోట్లూ రామ్‌ను చంపారు.
తరువాత, భద్రత బలగాలు ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. తర్వాత మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రతిఘటనను చురుకుగా నడిపిస్తూ మా వైపు నుంచి కమాండర్ చందన్ మొదట అమరుడయ్యాడు. అందరూ చివరి వరకు ప్రతిఘటించారు. దాదాకు చిన్న గీత కూడా తగలనివ్వలేదు. అందరూ అమరులైన తర్వాత దాదాను సజీవంగా పట్టుకుని చంపారు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. శాంతి చర్చల కోసం 40 రోజుల కాల్పుల విరమణ ప్రకటించాం. 40 రోజుల్లో ఒక్క దాడికి కూడా పాల్పడలేదు. ఈ సమయంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్ర పన్ని పెద్ద దాడి చేశాయి.
భద్రతలో విఫలమయ్యాం
ప్రధాన నాయకత్వం (నంబాల కేశవరావును ఉద్దేశించి) భద్రత విషయంలో మేము విఫలమయ్యాం. జనవరి వరకు ఈ యూనిట్‌లో భద్రత కోసం 60 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్లు. దాన్ని 35కు కుదించాం. ఈలోగా ఆ కంపెనీకి చెందిన కొంతమంది సీనియర్ వ్యక్తులు లొంగిపోయారు. ఈ దాడులను మేం ముందే ఊహించాం. కానీ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి దాదా ఒప్పుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కేడర్‌తో కలిసి ఉంటూ దగ్గరి నుంచి మార్గదర్శకత్వం ఇవ్వాలని దాదా నిర్ణయించుకున్నాడు.
తమ బాధ్యతలను విడిచిపెట్టి, నాయకత్వం పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారంతా సిగ్గుపడాలి. మే 21 చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. కగార్ పేరుతో ఊచకోత వెనుక ప్రభుత్వ నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని, దేశాన్ని అమ్మేవారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్రం మాతో మాత్రం చర్చలకు ఎందుకు రావడం లేదు.
నా గురించి ఆందోళన వద్దు
ఎన్‌కౌంటర్‌కు ముందు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లినప్పుడు నంబాల కేశవరావు తన సహచరులకు ఇచ్చిన సమాధానం ఇది. ‘మీరు నా గురించి చింతించకండి, నేను ఈ బాధ్యతను రెండు లేదా మూడేళ్లు మాత్రమే నిర్వర్తించగలను. మీరు యువ నాయకత్వం భద్రతపై శ్రద్ధ వహించాలి. బలిదానం కారణంగా ఉద్యమాలు బలహీనపడవు. చరిత్రలో బలిదానాలు ఉద్యమానికి బలాన్నిచ్చాయని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వ దుష్ట ప్రణాళికలు నిజం కావు. తుది విజయం ప్రజలదే అవుతుంది’ అని నంబాల పేర్కొన్నారు.