యూపీఐతో ‘చెల్లింపు’.. ప్రత్యేక వాహనాల్లో తరలింపు!  | Sakshi
Sakshi News home page

యూపీఐతో ‘చెల్లింపు’.. ప్రత్యేక వాహనాల్లో తరలింపు! 

Published Thu, Nov 30 2023 1:57 AM

Payment with UPI Transport in special vehicles - Sakshi

‘‘హలో.. మన నియోజకవర్గ ఓటర్ల కోసం బస్సులు, జీపులు సిద్ధం చేశాం. ఆరాంఘర్‌ కూడలికి వస్తే రెడీగా ఉంటాయి. వచ్చేయండి, అక్కడే మీకు ఓటు డబ్బులు చెల్లిస్తాం!’’..  ‘‘మీ ఎకౌంట్‌కు గూగుల్‌ పే నుంచి డబ్బులు పంపాం. ముట్టినయా చూసి ఓకే మెసేజ్‌ పెట్టండి..’’ 

సాక్షి, హైదరాబాద్‌: మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రిదాకా ఇదే తీరు. హైదరాబాద్‌లో, వివిధ పట్టణాల్లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీ ల అభ్యర్థులు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ఇవి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన లక్షల మంది ఓటర్లు గ్రేటర్‌ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ కనిపిస్తుండటంతో అభ్యర్థులు ఈ ఓటర్లపై దృష్టిపెట్టారు.

తమ నియోజకవర్గ ఓటర్లందరినీ రప్పించుకుని, తమకే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓట్ల కోసం యూపీఐ ద్వారా డబ్బులు జమ చేయడంతోపాటు స్వస్థలాలకు రవాణా సదుపాయాన్నీ ఏర్పాటు చేశారు. కొందరు అభ్యర్థులు మొత్తం సొమ్ము ముందే ట్రాన్స్‌ఫర్‌ చేయగా, మరికొందరు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి, ఓటు వేయటానికి వచ్చి నప్పుడు మిగతా సొమ్ము ఇస్తామని చెప్తున్నట్టు తెలిసింది.

అభ్యర్థుల అనుచరులు, స్థానిక నేతలు దీనంతటినీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఓటర్లను తరలించుకుపోయేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. కొందరు ఆర్టీ సీ, ప్రైవేటు బస్సులనూ బుక్‌ చేసినట్టు తెలిసింది. చాలా వరకు మినీ వ్యాన్లు, కార్లను సిద్ధం చేశారు. 

దావత్‌ ఇచ్చి.. స్లిప్పులు పంచి..! 
కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌ నుంచి తమ ఓటర్లను తరలించడానికి ముందు మంగళవారం రాత్రే శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లలో దావత్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఓటర్లను దావత్‌కు రప్పించి.. లిక్కర్, మాంసాహార భోజనం పెట్టారని సమాచారం. ఈ సమయంలో కొందరు నేరుగా ఓటర్లకే డబ్బులు ఇవ్వగా, మరికొందరు స్లిప్పులు రాసిచ్చి , సొంతూరికి వెళ్లాక ఓటేసే ముందు అది ఇచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. 

బస్టాండ్లలో విపరీతమైన రద్దీ 
ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ సొంతూర్లకు తరలివెళ్లారు. దీంతో బస్టాండ్లు, ఎల్‌బీనగర్, ఉప్పల్‌ కూడలి, ఆరాంఘర్‌ వంటి ప్రాంతాలు కిటకిటలాడాయి. దీనితో ఆర్టీసీ సుమారు 1,500కుపైగా అదనపు బస్సులను సిద్ధం చేసి ఆయా రూట్లకు నడిపింది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తరలించాయి.  

Advertisement
 
Advertisement