
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు.
అసలేం జరిగిందంటే..
ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్‌ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్‌తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్‌వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది.
విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ
ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్‌ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్‌రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్‌ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.
శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్‌తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment