లాక్‌డౌన్‌: తొలిరోజు ఇక్కట్లు 

Passengers Faced Problems Because Of Buses - Sakshi

బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు 

సమీప ప్రాంతాలకు మాత్రమే ఎక్కువ బస్సులు 

లాక్‌డౌన్‌ సడలింపు 4 గంటలే కావడంతో ఆ మేరకే టైమ్‌టేబుల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆకస్మిక లాక్‌డౌన్‌ తొలిరోజు బుధవారం బస్సు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య బస్సులు నడుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దూర ప్రాంత ప్రయాణాలపై స్పష్టత కొరవడటంతో గందరగోళం ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు బస్సులు బయలుదేరతాయని భావించి బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులకు నిరాశ ఎదురైంది. డిపోల నుంచి ఒకమాదిరి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు లాక్‌డౌన్‌ సమయంలోపు గమ్యం చేరేలా అధికారులు టైమ్‌టేబుల్‌ ఖరారు చేసి పంపించేశారు.

ఇక హైదరాబాద్‌ నగరం నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్నారు. అయితే ఈ ప్రాంతాలకు ప్రయాణ సమయం ఎక్కువ కావడంతో బస్సులు నడపలేదు. మిగతా ప్రాంతాలకు ఉదయం 8గంటల లోపే బస్సులన్నీ వెళ్లిపోయాయి. ఆ తర్వాత కొత్త ట్రిప్పులు అధికారులు నడపలేదు. దీంతో దూరప్రాంత ప్రయాణికులు, ఇతరులు ఉస్సూరుమంటూ వెనుదిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల నుంచి కూడా నగరానికి బస్సులు రాలేదు. బు«ధవారం రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో గమ్యం చేరి తిరిగి డిపోలకు చేరుకునే అవకాశం ఉన్న దగ్గరి ప్రాంతాల మధ్య మాత్రమే ఎక్కువగా బస్సులు నడిచాయి.  

10 శాతం బస్సులే..
లాక్‌డౌన్‌ తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా (సిటీ సర్వీసులు మినహా) 650 బస్సులు తిరిగాయి. ఇందులో దూరప్రాంతాలకు వెళ్లిన బస్సులు 12 మాత్రమే కావడం గమనార్హం. గురువారం కూడా ఇదేతరహాలో బస్సులను నడపనున్నట్లు, కేవలం 10 శాతం బస్సులు మాత్రమే నడిచే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు బస్టాండ్లకు రావాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉదయం నాలుగు గంటల పాటు సిటీ బస్సులు రాకపోకలు సాగించగా.. చాలాప్రాంతాల్లో బస్సులు ఖాళీగానే కనిపించడం గమనార్హం.  

దూరప్రాంతాలకు రైళ్లే దిక్కు
రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా దక్షిణ మధ్య రైల్వే రైళ్లను యథావిధిగా నడుపుతోంది. ప్రస్తుతం 80 వరకు రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. గత నెల వరకు ఎక్కువగానే ఉన్నప్పటికీ, సెకండ్‌ వేవ్‌ కేసుల సంఖ్య పెరగడంతో ఏప్రిల్‌ రెండో వారం నుంచి రైలు ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీంతో దాదాపు 30 శాతం రైళ్లు దశల వారీగా రద్దవుతూ వచ్చాయి. మిగతా రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో సరిహద్దులు దాటాలంటే రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ మామూలుగానే ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top