రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!? | Party discussions during local elections in Telangana | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?

Jul 16 2025 1:10 AM | Updated on Jul 16 2025 1:10 AM

Party discussions during local elections in Telangana

స్థానిక ఎన్నికల వేళ పార్టీల చర్చ 

ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సర్కారు నిర్ణయం 

పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సిద్ధం 

గతంలో మండల ప్రాతిపదికన సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు.. 

జిల్లా యూనిట్‌గా జెడ్పీటీసీ కోటా 

ఎంపీపీ అధ్యక్షుడికి జిల్లా యూనిట్‌గా, జెడ్పీపీ అధ్యక్షుడికి రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు 

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎలా మారుతాయనే దానిపై విస్తృత చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్‌ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్‌ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది.
 
ఆర్డినెన్స్‌ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను,   42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్‌లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్‌కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్‌ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్‌ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. 

తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! 
గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్‌గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్‌గా, జెడ్పీపీ చైర్మన్‌ రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్‌కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. 

స్థానాల సంఖ్యపై స్పష్టత! 
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్‌లు 566, జిల్లా పరిషత్‌లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 

2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీపీ)–(మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది.  

తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. 

రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది.  గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. 

సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్‌లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement