తెలంగాణకు రూ.5,239 కోట్లు.. పార్లమెంటులో చెప్పిన కేంద్రం

Parliament Question Hour Telangana Got Rs 5239 Crores Center - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆరు జాతీయ జలమార్గాలు వెళ్తున్నాయని అందులో గోదావరి– కృష్ణానది మినహా మిగతా ఐదు జాతీయ జలమార్గాలైన భీమా, మంజీరా, పెన్‌గంగ–వార్ధా, తుంగభద్ర, పెన్‌గంగ–ప్రాణహిత నదుల వ్యవస్థ జాతీయ జలమార్గాలు షిప్పింగ్, నావిగేషన్‌ కోసం సాంకేతిక–వాణిజ్యపరంగా ఆచరణీయం కాదని అధ్యయనంలో తేలిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు.

ప్రస్తుతం నల్లగొండలోని సిమెంట్‌ పరిశ్రమల నుంచి సిమెంట్‌ తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న ముక్త్యాల టెర్మినల్‌ను ఉపయోగించవచ్చా అని బీఆర్‌ఎస్‌ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. జాతీయ జలమార్గం–4 ఫేజ్‌–1లో భాగంగా కృష్ణా నదిపై ముక్త్యాల–విజయవాడ స్ట్రెచ్‌ (82 కి.మీ.) దశలవారీ పనుల అభివృద్ధికి ఇన్‌ల్యాండ్‌ భారత జలమార్గాల ప్రాధికార సంస్థ రూ.96 కోట్లు కేటాయించిందని వివరించారు. 

రాష్ట్రానికి రూ.5,238.93 కోట్లు.. 
తెలంగాణలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.5,238.93 కోట్లు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. కాగా, రాష్ట్ర వాటాతో కలిపి రూ.8,584.98 కోట్లు వాడినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 2014లో 668 ఉండగా, 2020లో 863కు చేరిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

గ్రామ సడక్‌ యోజన కింద 2,427.50 కి.మీ 
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన–3 కింద 2,427.50 కి.మీ రహదారి నిర్మాణానికి కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. కాగా ఇందులో డిసెంబర్‌ 14 నాటికి 2,395.84 కి.మీ పొడవుతో 356 రోడ్డు పనులు ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేశామని బీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు.  

45 దరఖాస్తుల ఆమోదం 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి 47, తెలంగాణ నుంచి 42 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా అందులో ఏపీకి చెందిన 26, తెలంగాణకు చెందిన 19 దరఖాస్తులను ఆమోదించామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
చదవండి: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top