
కార్బన్ హక్కుల పేరిట ఐఓఆర్‌ఏ అనే సంస్థకు 30 ఏళ్లపాటు ధారాదత్తం!
హరిత సౌభాగ్యం ప్రాజెక్టులో పాల్గొనడానికి సర్కారు అనుమతి
హరిత వనాల అభివృద్ధికి 12 వేల పంచాయతీలు తీర్మానం చేసి పంపాలని ఆదేశం?
గ్రామ పంచాయతీల లెటర్ హెడ్‌లపై గ్రామ సభలు పెట్టి ఎన్‌వోసీలు ఇవ్వాలని నిర్దేశం
ప్రస్తుతం పాలక మండళ్లు లేనందున అధికారులతోనే ఈ తతంగం పూర్తికానిచ్చే అవకాశం
ఈ నిర్ణయంతో పంచాయతీలు భూములపై హక్కులు కోల్పోతాయని ఆందోళన
భవిష్యత్తులో స్థలం కావాలంటే పంచాయతీలకు లభించని పరిస్థితి నెలకొంటుందన్న అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఓవైపు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పంచాయతీల్లోని భూములను 30 ఏళ్లపాటు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. ఈ మేరకు హరిత సౌభాగ్యం (తెలంగాణ) ప్రాజెక్టులో పాల్గొనడానికి ఐఓఆర్‌ఏ ఎకొలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వనుంది.
అందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసి పంపించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీల పరిధిలోని స్థలాల్లో హరిత వనాలను అభివృద్ధి చేయడానికి 30 ఏళ్ల వరకు సదరు సంస్థకు గ్రామ సభ పూర్తి అంగీకారంతో అప్పగిస్తున్నట్లు నిరభ్యంతర పత్రాన్ని సమర్పించడానికి సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది.
అయితే 30 ఏళ్లపాటు కార్బన్ హక్కులను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వల్ల ఆ భూములను మరే ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి పంచాయతీలకు అధికారం లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం గ్రామ పంచాయతీల పాలక మండళ్లు అధికారంలో లేని సమయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పంచాయతీలు తమ భూములపై హక్కులు కోల్పోవడమే అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పంచాయతీల్లో పాలక మండళ్లు లేని కారణంగా అధికారులే ఈ తతంగం పూర్తికానిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అవగాహన లేకుండా తీర్మానాలెలా?
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎలాంటి న్యాయ వివాదాలు లేని భూములనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నట్లు పంచాయతీలు తీర్మానంలో పేర్కొనాల్సి రానుంది. కార్బన్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో కమ్యూనిటీ అవసరాలకు సంస్థ వినియోగించాలని పేర్కొంటున్నా గ్రామ పంచాయతీలకు దీనిపై ఎలాంటి అవగాహన లేకుండా తీర్మానాలు చేసి ఇవ్వడం వల్ల పంచాయతీలకు రాబోయే 30 ఏళ్లలో ఏవైనా అవసరం కోసం భూమి కావాలంటే లభించని పరిస్థితులు నెలకొంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్బన్ క్రెడిట్స్‌తో వచ్చే ఆదాయంలో గ్రామ పంచాయతీలకు ఎంత చెల్లించాలి? ఎప్పుడు ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఎదురవనుంది.
అనుమానాలెన్నో..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేలకుపైగా ఉన్న గ్రామ పంచాయతీల స్థలాలను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలన్న నిర్ణయంలో ఆంతర్యం ఏమిటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీల స్థలాల్లో ఎలాంటి మొక్కలు నాటుతారు? అవి స్థానిక పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయా? ఒకే రకమైన మొక్కలు నాటడం ద్వారా జీవవైవిధ్యానికి ప్రమాదం కలిగే అవకాశాలు కూడా ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒప్పంద పత్రాలు రూపొందించింది ప్రైవేటు సంస్థే..
ఈ సంస్థకు పంచాయతీ స్థలాలపై పూర్తి అజమాయిషిని కట్టబెట్టడానికి వీలుగా సదరు సంస్థనే ఈ ఒప్పంద పత్రాలను పకడ్బందీగా రూపొందించడం గమనార్హం. ఈ తీర్మానాలకు సంబంధించి గ్రామ సభ మినిట్స్, సభకు హాజరైన సభ్యుల వివరాలు, ఫొటో/వీడియో డాక్యుమెంటేషన్ చేయడం, తీర్మానంపై సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సాక్షుల సంతకాలు, వార్డు సభ్యులు, సమావేశంలో పాల్గొన్న వారి సంతకాలు, ఎన్‌వోసీపై సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం, పంచాయతీకి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి? తదితర వివరాలతో సర్వే నంబర్లు తీసుకోవాలని పత్రాల్లో పేర్కొన్నారు.
అలాగే అంగీకార పత్రంలో రాష్ట్ర ఆదేశాల మేరకు కార్బన్ ఆదాయం, ప్రయోజనాల భాగస్వామ్య విధానం నుంచి ప్రయోజనం పొందే కమ్యూనిటీ హక్కు, ప్రాజెక్టులో పాల్గొనడానికి ఎలాంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా పాల్గొంటున్నామని పేర్కొనాల్సి రానుంది. గ్రామ సభలో చర్చించడానికి తగినంత సమయం ఇచ్చారని, తాము ముందస్తు ఉచిత సమ్మతిని స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు గ్రామ సభలో పాల్గొన్న వారు ఇచ్చేలా ఒప్పందాన్ని రూపొందించడం గమనార్హం.