ఏడాదికి రాష్ట్ర ప్రజలు తింటున్న కోడికూర లెక్క ఇదీ!

Over 3 Lakh Tonnes Of Chicken Consumed In Telangana Yearly - Sakshi

మొత్తం మాంసాహారంలో 44 శాతం చికెన్‌దే

గొర్రెలు, మేక మాంసం మరో 40 శాతం

కోళ్లఫారాల నుంచి నమూనాలను పరీక్షించిన పశు సంవర్థక శాఖ

రాష్ట్రంలో కనిపించని బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు.. 

సాక్షి, హైదరాబాద్‌: చికెన్‌.. రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ఆరగించే ఈ మాంసాహారంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకే దొరికే బలవర్ధకమైన మాంసాహారం కోడికూర అని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని సూచిస్తున్నారు. ఇటీవల పశుసంవర్థక శాఖ తయారుచేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో ఏటా 3.6 లక్షల టన్నులకు పైగా చికెన్‌ వినియోగమవుతోంది. మొత్తం మాంసం మార్కెట్‌లో ఇది 44 శాతం కాగా, ఒక కిలో చికెన్‌లో 250 గ్రాముల ప్రోటీన్‌లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సింహభాగం చికెన్‌దే రాష్ట్రంలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఆరగించేది చికెనే అని లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల పశుసంవర్ధక శాఖ రూపొందించిన ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం మాంసాహార మార్కెట్‌లో 44 శాతం చికెన్‌దేనని 
తేలింది. ఏటా రాష్ట్ర ప్రజలు 3,63,850 టన్నుల కోడికూర లాగించేస్తున్నారని చెబుతోంది.

ఇక నాటుకోళ్ల రూపంలో రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెంచుకుని ఆరగించే మాంసం ఈ లెక్కలోకి రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇతర మాంసాహారాల్లో గొర్రె మాంసం 32 శాతం, మేక మాంసం 8 శాతం, నల్లజాతి పశువుల మాంసం 14 శాతం తింటున్నారని తేలింది. ముఖ్యంగా చికెన్‌లో 25 శాతం ప్రోటీన్లు ఉంటాయని, తక్కువ ధరకు దొరికే బలవర్ధకమైన మాంసాహారం ఇదేనని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మటన్‌లో 20 శాతం మాత్రమే ప్రోటీన్లు ఉంటాయని చెబుతున్నారు. ఈసారి బర్డ్‌ఫ్లూ లేనట్టే ఇటీవల దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకింది. మన రాష్ట్రంలోనూ గత రెండేళ్ల కింద ఈ వ్యాధి సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లను పూడ్చిపెట్టాల్సి వచ్చింది. (చదవండి: సిటీ టేస్ట్‌.. చికెన్‌ ఫస్ట్‌..)

ఈ ఏడాది కూడా దేశంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించడంతో మన రాష్ట్ర చికెన్‌ మార్కెట్‌పై కూడా ఈ ప్రభావం పడింది. అయితే పశుసంవర్ధక శాఖ మాత్రం బర్డ్‌ఫ్లూ మన రాష్ట్రంలో లేదని స్పష్టం చేస్తోంది. ఇటీవల కొన్ని జిల్లాల్లో చాలా కోళ్లు, నెమళ్లు మరణించడానికి బర్డ్‌ఫ్లూ కారణం కాదని, ఇతర కారణాలతో చనిపోయాయని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల కోళ్ల ఫారంలు ఉండగా, వాటిలోని 75 శాతం ఫారంల నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కన్పించకపోవడంతో చికెన్‌ వినియోగంపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను ఆ శాఖ అధికారులు నివృత్తి చేసే పనిలో పడ్డారు.

అనవసరపు భయాలొద్దు.. 
చికెన్‌ తినే విషయంలో ప్రజలు లేనిపోని అపోహలకు గురికావద్దు. రోజుకు ఒక గుడ్డు తింటే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. కోడిమాంసం కూడా చాలా బలవర్ధకమైనది. తక్కువ ధరకు దొరికే బలవర్ధక మాంసాహారం ఇదే. బర్డ్‌ఫ్లూ మన రాష్ట్రంలో రాలేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.
– రాంచందర్, పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top