భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి నిద్ర సమస్యలు
నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో మనకూ స్థానం
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, డిప్రెషన్, ఆందోళనలకు దారితీత
78% మంది డాక్టర్లను ఆశ్రయించేందుకు పరుగులు
140 కోట్ల జనాభాకు 500 కంటే తక్కువగా సరి్టఫైడ్ స్లీప్ స్పెషలిస్టులు
ఆధునిక జీవనశైలి, శారీరక మార్పుల వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో ఒకటిగా మారుతోంది. మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారని వైద్య అధ్యయనాలు, వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గంటల తరబడి నిద్ర పట్టకపోవడం...రాత్రిపూట పదే పదే మెలకువ రావడం...రాత్రి వేళల్లో కాళ్లు లాగడం వల్ల నిద్రకు భంగం కలగడం.. ఇలా అనేక రకాల నిద్ర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.
అధ్యయనాలు, సర్వేల్లో ఏం తేలిందంటే ?
తాజాగా ఐ–స్లీప్స్ (నిమ్‌హన్స్–ఐఐఐటీ హైదరాబాద్) పరిశోధనలో పక్షవాతానికి సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా ఇతర అవయవాల నుంచి వచ్చిన కణాలు అడ్డుపడి ఆక్సిజన్ అందకపోవడం) వచి్చన రోగుల నిద్రను పరిశీలించగా, వారిలో 85% మంది శ్వాస రుగ్మతలతో బాధపడుతున్నట్లు తేలింది. వృద్ధులలో దాదాపు 37% మంది దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. షిఫ్ట్ వర్కర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, నిరుద్యోగులలో (13.34%) బయోలాజికల్ క్లాక్ దెబ్బతినడం వల్ల నిద్ర రుగ్మతలు ఎక్కువగా నమోదవుతున్నాయి
⇒ ఎయిమ్స్ న్యూఢిల్లీ పరిశోధకుల సమగ్ర విశ్లేషణ ప్రకారం.. సుమారు 4.7 కోట్ల మందికి తీవ్రమైన స్లీప్ అప్నియా ఉంది. దీనివల్ల నిద్రలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి
⇒ 2026 రెస్‌మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వే ప్రకారం నిద్రలేమి సమస్య పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువ శారీరక, మానసిక ప్రభావాన్ని చూపుతోంది. భారతీయులలో నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి/ఆందోళన (39%), ఆఫీసు పనులు (37%), ఇంటి పనుల బాధ్యతలు (31%) ప్రధాన కారణాలు.78% మంది నిద్ర సమస్యల కోసం డాక్టర్‌ను సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
⇒ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్–2026 సర్వే ప్రకారం...దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యధిక నిద్రలేమి ఉన్న నగరంగా నిలిచింది. మెరుగైన నిద్ర నాణ్యతతో చెన్నై నగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు 90% మంది భారతీయులు పడుకునే ముందు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని తేల్చింది.
⇒ బ్లెస్ కోహోర్ట్ స్టడీ 2025 ప్రకారం.. తీవ్రమైన స్లీప్ అప్నియా ఉన్న రోగులలో మధుమేహం, రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు ఈ క్లినికల్ అధ్యయనం స్పష్టం చేసింది.
⇒ లోకల్ సర్కిల్స్ 2026 సర్వే ప్రకారం...సుమారు 72% మంది రాత్రి వేళల్లో మూత్రవిసర్జన కోసం లేవడం వల్ల నిద్రాభంగం కలుగుతోందని తెలిపింది. ఇది డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం కావచ్చునని, 46% మంది రాత్రిపూట కనీసం 6 గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని తెలిపింది. దాదాపు 55% మంది ఇండియన్లు అర్ధరాత్రి దాటిన తర్వాతే పడుకుంటున్నారని పేర్కొంది.
నిద్రలేమితో ఆరోగ్య ప్రమాదాలు
⇒ సరైన నిద్ర లేకపోతే రక్తపోటు పెరిగి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుదల.
⇒ ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్–2 డయాబెటిస్ వస్తుంది.
⇒ ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, తీవ్రమైన డిప్రెషన్, మానసిక ఆందోళనకు దారితీస్తాయి.
⇒ డ్రైవర్లలో అలసట, నిద్రమత్తు కారణంగా దేశంలోని హైవేలపై దాదాపు 40% ప్రమాదాలు జరుగుతున్నాయి.
సమతుల్యమైన నిద్రలో హైదరాబాద్‌కు రెండవస్థానం
గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ 2026 అధ్యయనం ప్రకారం భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధిక నాణ్యత, అత్యంత సమతుల్యమైన గల నిద్రను అనుభవిస్తున్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. అలాగే, 42% మంది ప్రజలు ఆలస్యంగా నిద్రపోతున్నారని, సుమారు 31% మందికి నిద్రలేమి లేదా నిద్ర సరిపోకపోవడం గురించిన ఆందోళనలు చెందుతున్నారని పేర్కొంది.
ఒకే సమయాన్ని అలవాటు చేసుకోవాలి
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, టీవీలకు దూరంగా ఉండాలి. రాత్రి భోజనం నిద్రపోయే సమయానికి కనీసం 2–3 గంటల ముందే ముగించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సాయంత్రం వేళల్లో కాఫీ, టీ, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. శారీరక వ్యాయామం, యోగా చేయడం వల్ల గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రపోయే గది ప్రశాంతంగా, కాంతి లేకుండా చీకటిగా, అనుకూలమైన ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోవాలి.
– డా. జీసీ ఖిల్నాని, ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ నిపుణులు
ముఖ్యాంశాలు ఇవీ ...
⇒ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో 30% నుంచి 40% మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
⇒ పురుషుల(8.3%)తో పోలిస్తే మహిళల్లో (10.3%) ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు దక్షిణాది రాష్ట్రాలో జరిపిన ఒక వైద్య సర్వేలో తేలింది.
⇒ నిద్రలేమితో బాధపడుతున్న వారిలో కేవలం 3% మంది మాత్రమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు.
⇒ స్లీప్ అప్నియా ఉన్న రోగులలో 60% నుంచి 70% మంది ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.
⇒ భారతీయుల సగటు నిద్ర సమయం 5.77 గంటలకు పడిపోయింది.
⇒ భారత్‌లో 140 కోట్లకు పైగా జనాభా ఉండగా, నిద్ర రుగ్మతలకు చికిత్స చేసే సరి్టఫైడ్ స్లీప్ స్పెషలిస్ట్‌లు 500 కంటే తక్కువ మందే ఉన్నారు.


