Registrations Department: కుర్చీ వదిలేదేలే! | Sakshi
Sakshi News home page

Registrations Department: కుర్చీ వదిలేదేలే!

Published Wed, Oct 19 2022 1:46 AM

Officers and staff who have been ingrained Registration Department for years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించే రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మంది అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. తమకు కాసుల పంట పండుతుండటంతో కొందరు డిప్యుటేషన్ల గడువు ముగిసినా సీట్ల నుంచి కదిలేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక జిల్లా కేంద్రంలో జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ పదేళ్లుగా అక్కడే పనిచేస్తుండగా మరో జిల్లా కేంద్రంలోని ఓ సబ్‌రిజిస్ట్రార్‌కు పోస్టింగ్‌ ఇచ్చి ఏకంగా 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బదిలీ కాలేదు. ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌లుగా పనిచేస్తున్న వారు సైతం పదోన్నతులు పొందినా ప్రస్తుత స్థానాలను వదలడం లేదు. ఆయా సబ్‌ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా రాజకీయ అండదండలతో అవే సీట్లలో కొనసాగుతున్నారు. దీంతో ఆమ్యామ్యాలు లేనిదే డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

దొడ్డిదారి.... పైరవీల రహదారి 
రాష్ట్రవ్యాప్తంగా 25 మంది వరకు డిప్యుటేషన్లపై కొనసాగుతుండగా ఇటీవలే బంజారాహిల్స్, నార్సింగి, ఉప్పల్, మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్ల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇలాంటి కార్యాలయాల్లో పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. సబ్‌ రిజిస్ట్రార్‌లుగా డిప్యుటేషన్, ఇన్‌చార్జి పోస్టింగుల కోసం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. డిప్యుటేషన్‌ పోస్టింగుల కోసం పైరవీలు చేసిన వారే మళ్లీ వాటి రద్దు కోసం ప్రయత్నాలు చేయడం, కీలక బాధ్యతల్లో ఉన్న ఓ మంత్రిపై ఒత్తిడి చేస్తుండటం ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టింగుల కోసం కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయని, హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు, రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో డీఆర్‌ పోస్టింగుల కోసం కూడా ప్రభుత్వ పెద్దలపై అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతోంది. 

బదిలీలు ఏమయ్యాయి? 
రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరిగి దశాబ్ద కాలం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సబ్‌రిజిస్ట్రార్ల సాధారణ బదిలీలు జరగ్గా మియాపూర్‌ భూ కుంభకోణం తర్వాత 2017లో కొందరిని బదిలీ చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోకల్‌ కేడర్‌ అలాట్‌మెంట్‌లో భాగంగా సీనియారిటీ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అటూఇటు అయ్యాయి. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే. ఇక కిందిస్థాయి సిబ్బంది బదిలీలు 2010 తర్వాత జరగనేలేదు. అధికారులు, సిబ్బంది బదిలీల కోసం కొన్ని నెలల కిందటే కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం దానిపై నిర్ణయం మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. సుదీర్ఘకాలంగా బదిలీలు జరగకపోవడంతోనే డిప్యుటేషన్ల కోసం పైరవీలు, ఇన్‌చార్జీల పాలన నడుస్తోందని.. వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

లంచాలివ్వకుంటే అన్నీ కొర్రీలే... 
చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్‌లలో కొందరు తమకు ‘రావాల్సినవి’అందిన డాక్యుమెంట్లు... ఏజెంట్లు తీసుకొచ్చే డాక్యుమెంట్ల విషయంలో ఒకలాగా, మిగిలిన డాక్యుమెంట్ల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమంటే రిజిస్ట్రేషన్ల చట్టంలోని ఏదో ఒక రూల్‌ చెప్పి కొర్రీ వేయడం వారికి పరిపాటిగా మారింది. నాలుగు సార్లు ఏదో రకంగా వెనక్కు పంపిస్తే ఐదోసారి తమకు కావాల్సినవి ముట్టజెప్తారనే ధోరణిలోనే సబ్‌రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారని, ముట్టిన తర్వాత చట్టాలు ఎలా ఉన్నా పని అయిపోతుందనే చర్చ బహిరంగ రహస్యమే.   

Advertisement
 
Advertisement
 
Advertisement