రెస్టారెంట్‌కూ ర్యాంకు! | Now even restaurants are ranked in hyderabad | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌కూ ర్యాంకు!

Jul 6 2026 5:14 AM | Updated on Jul 6 2026 5:14 AM

Now even restaurants are ranked in hyderabad

సైబరాబాద్‌ పరిధిలో  ప్రయోగాత్మకంగా అమలు 

శుచి, శుభ్రత, నిర్వహణ ఆధారంగా స్కోర్‌ 

39 రెస్టారెంట్లకు ర్యాంకులు  జారీ చేసిన సీఎంసీ 

టాప్‌ రేంజ్‌ను అందుకున్నవి ఐదు మాత్రమే.. 

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలో ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లే ముందు అక్కడి పదార్ధాల రంగు, రుచి, వాసన ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫుడీస్‌ను అడిగో లేదా రేటింగులు గమనించో తెలుసుకోవచ్చు. కానీ ఆయా రెస్టారెంట్లు పాటిస్తున్న శుభ్రత ప్రమాణాలు, దినుసుల నాణ్యత వంటివి తెలుసుకోవాలంటే? దీనికి సైబరాబాద్‌ పరిధిలో అధికారులు ఓ పరిష్కారం కనిబెట్టారు. ఆయా రెస్టారెంట్లు పాటిస్తున్న శుచి శుభ్రతలను తనిఖీ చేసి ర్యాంకులు ఇస్తున్నారు. 

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) ఇటీవల నిర్వహించిన ఆహార భద్రత తనిఖీ ఆధారంగా 39 రెస్టారెంట్లు, కేఫ్‌లు, పాఠశాలలు, సెంట్రల్‌ కిచెన్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలకు హైజీన్‌ స్కోర్లు ప్రకటించింది. ఈ స్కోర్లు 18 శాతం నుంచి 94 శాతం వరకు నమోదయ్యాయి. పరిశుభ్రత, ఆహార నిర్వహణ, నిల్వ విధానాలు, పురుగుల నియంత్రణ, లేబులింగ్, రికార్డుల నిర్వహణ, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిబంధనల అమలు వంటి అంశాల ఆధారంగా అధికారులు రెస్టారెంట్లకు మార్కులు కేటాయించారు. తనిఖీల్లో లోపాలు గుర్తించిన సంస్థలకు ’ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు’జారీ చేయగా, అవసరమైన చోట్ల చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. 

టాప్‌ స్కోర్లు సాధించినవి ఇవే... 
ఈ ర్యాంకులను దక్కించుకున్న వాటిలో 94 శాతం హైజీన్‌ స్కోరుతో ఇనార్బిట్‌ మాల్‌లోని పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రాంగణంలో ఉన్న 10 పౌండర్‌ పిజ్జేరియా, లులు మాల్‌లోని సినీ పోలీస్, కొండాపూర్‌లోని చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, కొల్లూరులోని గ్రేడియం స్కూల్‌ కిచెన్‌ అగ్రస్థానంలో నిలిచాయి. అలాగే రామేశ్వరం కేఫ్‌ 93 శాతం, సత్తిబాబు బిర్యానీ 92 శాతం స్కోర్‌ సాధించాయి. నిజాంపేట్‌లోని కేఎఫ్‌సీ (86 శాతం), జీఎస్‌ఎమ్‌ మాల్‌లోని ఐనాక్స్‌ (85%), అంతేరా (83%), కేఎస్‌ బేకర్స్‌ (82%), చైనీస్‌ వోక్‌ (82%), గ్లెండేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కిచెన్‌ (82%) టాప్‌లో నిలిచాయి.  

అత్యల్ప స్కోర్‌ 18 శాతం... 
గచ్చిబౌలిలోని రాయల్‌ స్పైస్‌ 18 శాతం స్కోరుతో చివరి స్థానంలో నిలిచింది. జయేకా ఫుడ్‌ కోర్ట్‌ 25 శాతం, ప్లాట్‌ఫార్మ్‌–65 (37%), బహార్‌ కేఫ్‌ (40%), ఫుడ్‌ ప్లానెట్‌ (51%), స్వగృహ ఫుడ్స్‌ (54%), ది స్పైస్‌ కిచెన్‌ (56%) స్కోర్లు నమోదు చేశాయి. లాపినోజ్‌ పిజ్జా, మెహ్‌ఫిల్‌ రెస్టారెంట్, ఐడియల్‌ కిచెన్, పంచకట్టు దోశలు 67శాతం స్కోర్లతో ఫరవాలేదనిపించుకోగా, షాగౌస్, ప్రొటీన్‌ చెఫ్‌లు 65 శాతం చొప్పున, జొమాటో హైపర్‌ప్యూర్‌ 63 శాతం, కోడికూర చిట్టిగారె 62 శాతం, ఇగురు 61 శాతం, కంచి కేఫ్, పాలమూరు గ్రిల్‌ 60 శాతం చొప్పున స్కోర్‌ దక్కించుకున్నాయి. 

మొత్తంగా చూస్తే పరిశుభ్రతలో అత్యధికంగా 94 శాతం స్కోరు నమోదుకాగా, అత్యల్పంగా 18 శాతం మాత్రమే నమోదైంది. ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరించిన పలు ఆహార కేంద్రాలకు లోపాలను సరిదిద్దాలని నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు, స్కోర్ల నమోదు నిరంతరం కొనసాగుతాయని సీఎంసీ వెల్లడించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement