ఎమ్మెల్సీ కౌంటింగ్‌: మూడో ప్రాధాన్యం తప్పదా? 

No Majority Confusion Mode In Nalgonda Khammam Warangal MLC Counting - Sakshi

‘నల్లగొండ’గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో నంబర్‌ గేమ్‌ 

మొదటి, రెండో ప్రాధాన్య ఓట్లతో విజేత తేలడం కష్టమే! 

ఇప్పటి వరకు  ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తి 

సాక్షి,నల్లగొండ: నల్లగొండ– వరంగల్‌– ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదురౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈ ఐదురౌండ్లలో 2,79,970 ఓట్లను లెక్కించగా, వాటిలో 15,533 ఓట్లు చెల్లకుండాపోయాయి. చెల్లిన 2,64,437 ఓట్లలో పల్లా 79,113 ఓట్లు సాధించా రు. ఆయనకు 18,549 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 60,564 ఓట్లు, టీజేఎస్‌ అభ్యర్థి ప్రొఫెస ర్‌ కోదండరామ్‌కు 49,200 ఓట్లు వచ్చాయి. 

నిర్ణయం కాని కోటా 
ఈ స్థానానికి జరిగిన పోలింగ్‌లో 3,86,320 ఓట్లు పోల్‌ కాగా, వీటికి అదనంగా మరో 1,759 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చి చేరాయి. దీంతో 3,88,079 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్య ఓట్లన్నీ లెక్కించాక కానీ, చెల్లని ఓట్లు ఎన్నో తేలే అవకాశం లేదు. చెల్లని ఓట్లు తీసేశాకనే.. చెల్లిన ఓట్లలో యాభై శాతం ప్లస్‌ ఒక ఓటును కోటాగా నిర్ణయించనున్నారు.

అనధికారిక అంచనా మేరకు ఈ కోటా 1.82 లక్షల ఓట్లు కావొచ్చని అంటున్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించే అవకాశం ఏ అభ్యర్థికీ కానరావడం లేదు. ప్రతిరౌండ్‌లో 15 వేల పైచిలుకు ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వస్తున్నాయి. ఇప్పటికే 79,113 ఓట్లు ఆయన ఖాతాలో పడగా.. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

సరాసరి ఇదేస్థాయిలో రెండు రౌండ్లలో కూడా 15 వేల చొప్పున టీఆర్‌ఎస్‌కు వస్తే.. పల్లాకు దాదాపు 1.10 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆయన విజయానికి మరో 70 వేల ఓట్ల దూరంలో ఉండిపోతారనుకుంటే.. ఆ ఓట్లన్నీ రెండో ప్రాధాన్యంలో రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఓట్లు రాని పక్షంలో మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు వెళ్లాల్సి ఉంటుంది.

పార్టీల లెక్కలివీ...! 
ఇప్పటి వరకు రౌండ్ల వారీగా వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు దాదాపు 30 శాతం ఓట్లు పోల్‌ అవుతున్నాయి. ఆయన 18,549 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఐదు రౌండ్లలో వచ్చినట్లే సరాసరి 3,500 ఓట్ల లీడ్‌ మిగిలిన రెండు రౌండ్లలో వస్తే, ఆయన మెజారిటీ కనీసం 25 వేలకు చేరుతుందని అంచనా. రెండో స్థానంలో ఉన్న మల్లన్న విజయం సాధించాలంటే పల్లాతో ఉన్న తేడా(లీడ్‌) 25 వేల ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 28 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

మూడోస్థానంలో ఉన్న కోదండరాం విజయం సాధించాలంటే.. తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే సాధ్యమైనన్ని ఎక్కువ రెండో ప్రాధాన్య ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యంలో కూడా విజేత తేలకపోతే.. తొలి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల నుంచి ఒకరు ఎలిమినేషన్‌కు గురవుతారు. అలా ఎలిమినేషన్‌కు గురైన అభ్యర్థి ఓట్లలోని మూడో ప్రాధాన్యాన్ని మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పోల్‌ అయితే ఎవరి ఓట్లను వారికి కలిపి విజేతను ప్రకటిస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top