గ్రూప్‌–1 మెయిన్స్‌ సన్నద్ధతపై సందిగ్ధం! 

No Information From TSPSC About Group-1 Mains Exam - Sakshi

మూడు నెలలు కావస్తున్నా వెలువడని ప్రిలిమ్స్‌ ఫలితాలు 

మెయిన్స్‌కు అర్హత విషయంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ 

ఇప్పటికే వివిధ కేటగిరీల్లో ఇతర ఉద్యోగాలకు దరఖాస్తులు షురూ.. 

దీంతో ఏ కొలువుకు సిద్ధమవ్వాలో తెలియని పరిస్థితిలో అభ్యర్థులు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి మూడు నెలలు కావస్తున్నా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికీ ఆ ఫలితాలను ప్రకటించలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలకు సన్నద్ధం కావాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రాథమికంగా వెల్లడించింది.

ఈ క్రమంలో గడువు దగ్గర పడుతుండగా.. ప్రిలిమ్స్‌ ఫలితాలను ఇంకా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4 కొలువులతో పాటు ఇతర కేటగిరీల్లో పోస్టుల ప్రకటనలు పెద్ద సంఖ్యలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్‌–1 మెయిన్స్‌ అర్హతపై స్పష్టత వస్తే ఇతర ఉద్యోగాలవైపు దృష్టిపెట్టాలా? వద్దా? అనేది తేల్చుకోవడానికి అవకాశం ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు.  

8.7 శాతమే మెయిన్స్‌కు అర్హులు 
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌–1 కేటగిరీలో 503 ఖాళీల భర్తీకోసం గతేడాది అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజర్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్‌కు ఎంపికవుతారు. ఈ క్రమంలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు మొదలు పెట్టింది. మలీ్టజోన్ల వారీగా రిజర్వేషన్లుకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేస్తూ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలి.

ఈ లెక్కన 25,150 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయాలి. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో కేవలం 8.7 శాతం మంది మాత్రమే మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధిస్తారు. దీంతో మిగతా అభ్యర్థులు ఇతర కొలువులపై దృష్టి పెట్టాల్సిందే. ఈ క్రమంలో గ్రూప్‌–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైతే మిగతా అభ్యర్థులు ఇతర కొలువులకు సన్నద్ధం కావడానికి వీలుంటుంది. కానీ ఇప్పటికీ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top