Telangana: మలుగు పాపెర.. కిలో 2 వేలు!

Nizamabad: Big Malugu Papera Fish Found In Nizamsagar Canal Warne - Sakshi

వర్ని: నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ శివారులోని నిజాంసాగర్‌ కాలువలో నాలుగున్నర కిలోల మలుగు పాపెర చేప మంగళవారం లభ్యమైంది. కాలువపై నుంచి శ్రీనివాస్, నాందేవ్‌ కలిసి వెళ్తుండగా ఈ చేప కనిపించడంతో వెంటనే కాలువలోకి దిగి పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి చేపలు ఉండవన్నారు. కిలో రూ.2 వేల వరకు ధర పలుకుతుందన్నారు. 

తల్లి చేప ఉత్పత్తికి మోక్షమెన్నడో..
సాక్షి, నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద తల్లి చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. అవసరమైన నిధులున్నా సకాలంలో పనులు చేపట్టడం లేదు. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో తల్లి చేపల ఉత్పత్తి కేంద్రం ఎప్పటికి పూర్తి చేస్తారో అంటూ మత్స్యకారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సారెస్పీ వద్ద గల జాతీయ చేప పిల్లల కేంద్రం సమీపంలో తల్లి చేపల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ. 2.5 కోట్లు కేంద్రం, మరో రూ. 2.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిర్ణయించారు. 2017లో ప్రారంభించిన పనులు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయి.  

దేశంలో ప్రస్తుతం ఒక్కటే..
దేశంలో ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్‌ కేంద్రంగా తల్లి చేపల ఉత్పత్తి కేంద్రం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తల్లి చేపల ఉత్పత్తికి ఎస్సారెస్పీ అనువుగా ఉంటుందని భావించి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నిర్మాణ పనుల కోసం స్థానిక మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే పలు మార్లు భువనేశ్వర్‌ వెళ్లి పరిశీలించారు. పనులు చేపట్టేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తయి నాలుగేళ్లు పూర్తవుతున్నా పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. 

తల్లి చేపల ఉత్పత్తి కేంద్ర నిర్మాణం ఇలా.. 
తల్లి చేపల ఉత్పత్తి కేంద్రంలో బ్రీడింగ్‌ పాండ్లు, రేరింగ్‌ పాండ్లు, హేచరి పాండ్లు, నర్సరీ పాండ్లను నిర్మిస్తారు.  సాధరణంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మట్టి కుండీలే ఎక్కువగా ఉంటాయి. కాని ఆ కుండీలకు రివిట్‌ మెంట్‌ ఉండదు. తల్లి చేపల ఉత్పత్తి కేంద్రంలో మట్టి కుండీలకు లోపలి వైపు రివిట్‌ మెంట్‌తో నిర్మించారు. అయితే భువనేశ్వర్‌లోని నిర్మాణ నమూనాల మేరకే ఎస్సారెస్పీ వద్ద పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  

మేలు రకం చేపల ఉత్పత్తి
తల్లి చేపల కేంద్రంలో మేలు రకం చేపలను ఉత్పత్తి చేస్తారు. అందుకు ప్రస్తుతం ఒరిస్సాలో పెంచుతున్న చేపలను  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు దిగుమతి చేయాలి. బోత్స, రోహూ, బంగారు తీగ జాతుల్లోనే మేలు రకం చేపలను దిగుమతి చేస్తారు. ఈ రకానికి చెందిన చేపలు ఏడాదికి 3 కిలోల బరువు పెరిగే అవకాశం ఉంటుందని  మత్స్య శాఖ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన చేపలను రెండేళ్ల పాటు పెంచి తయారు చేసిన తల్లి చేపల నుంచి చేప పిల్లలను ఉత్పత్తి చేస్తారు.

రాష్ట్రంలోనే కాకుండా అవసరమైన మేరకు ఇతర రాష్ట్రాలకు కూడ చేప పిల్లలను  సరఫరా చేస్తారు. సాధారణంగా ప్రస్తుతం ఉన్న రకం చేపలు ఏడాదికి కేవలం  ఒక కేజీ బరువు మాత్రమే పెరుగుతాయి. కాని మేలు రకం చేప పిల్లలు మూడు కేజీలు పెరిగే అవకాశం ఉందని భావించి ఎస్సారెస్పీ వద్ద తల్లి చేపల కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. 

పనులు పూర్తవగానే.. 
తల్లి చేపల కేంద్రంలో పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ తల్లిచేపల కేంద్రాన్ని అప్పగించలేదు. ఇదే విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పనులు పూర్తయిన వెంటనే తల్లి చేపలను ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం.  –మోయినుద్దీన్, మత్స్యశాఖ అధికారి, ఎస్సారెస్పీ   

చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top