మూడేళ్ల ‘ఆకలి’ తీర్చారు

NIMS Surgical Gastro Department Successfully Treated Throat Cancer - Sakshi

నోటి కేన్సర్‌తో మెతుకు మింగ లేకపోయిన జగిత్యాలవాసి 

శస్త్ర చికిత్స చేసిన నిమ్స్‌ వైద్యులు, కోలుకున్న బాధితుడు 

సాక్షి, సిటీబ్యూరో:  గొంతు కేన్సర్‌తో బాధపడుతూ, ఆహారం కూడా తీసుకోలేకపోతున్న ఓ బాధితునికి నిమ్స్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో విభాగం వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూడేళ్లుగా పిడికెడు మెతుకులకు నోచుకోని ఆ బాధితునికి కడుపు నిండా ఆరగించే అవకాశం కల్పించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి గత మూడేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించారు.

సదరు ఆస్పత్రి వైద్యులు రేడియేషన్‌ చికిత్స అందించారు. దీంతో కేన్సర్‌ కణాలతో పాటు అన్నవాహిక, కృత్రిమంగా ఏర్పాటు చేసిన పైపు కూడా దెబ్బతింది. దీంతో గొంతుకు ఓ వైపు శస్త్రచికిత్స చేసి కేన్సర్‌ సోకిన భాగాన్ని పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత ఆహారనాళానికి ప్రత్యామ్నాయంగా ముక్కు నుంచి ఓ పైపును అమర్చి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆ పైపు ద్వారా నే ద్రవ పదార్థాలను తీసుకునేవారు. ఆకలైనప్పుడు నాలుగు మెతుకులు తినాలనుకున్నా తినలేక పోయే వాడు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ బీరప్పను నెల రోజుల క్రితం ఆశ్రయించారు.  

పది మంది, పది గంటలు శ్రమించి... 
మూడేళ్లుగా ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని తెలిసి వైద్యులు చలించిపోయారు. బాధితునికి పెట్‌స్కాన్‌ సహా ఇతర వైద్య పరీక్షలు చేయించిన వైద్యులు కేన్సర్‌ లేదని నిర్ధారించుకున్నారు. డాక్టర్‌ బీరప్ప నేతృత్వంలో పది మందితో కూడిన వైద్య బృందం సుమారు పది గంటల పాటు శ్రమించి ఈ నెల 9న ఆయనకు చికిత్స చేశారు. ముక్కు నుంచి వేసిన పైపులైన్‌ను తొలగించి, కొలాన్‌ బైపాస్‌ సర్జరీ చేశారు. అన్నవాహికను పెద్ద పేగుతో అనుసంధానించారు.

పూర్తిగా కోలుకొని ఆహారం తీసుకుంటుండటంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జ్‌ చేశారు. ఇలాంటి చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో పది లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్లు డాక్టర్‌ బీరప్ప స్పష్టం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top