
త్వరలో అందుబాటులోకి అల్లనేరేడులో కొత్త వెరైటీ
అభివృద్ధి చేసిన సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్..
గుజ్జు, రుచి బాగుంటుందంటున్న శాస్త్రవేత్తలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అల్లనేరేడు (కాలా జామూన్) ఫలంలో సరికొత్త వెరైటీ అందుబాటులోకి రానుంది. సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం (ఎఫ్‌ఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు ఈ కొత్త వెరైటీని అభివృద్ధి చేశారు. కండ (గుజ్జు) ఎక్కువగా ఉండే ఈ కాలాజామూన్ ఎంతో రుచికరంగా ఉంటుందని, దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ పంట సాగుచేసే ఉద్యానవన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ అల్లనేరేడులో కొంకన్, కృష్ణ, నీలం, పంత్‌ప్రభాత్, ఆజాద్–1, అర్కా కిరణ్, సీడ్‌లెస్, బ్లాక్‌పెర్ల్ వంటి వెరైటీలున్నాయి. ఒక్కో వెరైటీ పండు పరిమాణం, రంగు, రుచిలో తేడాలుంటాయి. ఇప్పుడు మరో కొత్త వెరైటీ అందుబాటులోకి రానుంది.
ఎనిమిదేళ్ల పరిశోధన..
శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించి సంగారెడ్డిలో ఫల పరిశోధన స్థానం (ఎఫ్‌ఆర్‌ఎస్) ఉంది. ఈ యూనివర్సిటీకి సంబంధించి స్టేట్ ప్లాన్‌లో భాగంగా ఈ కొత్త రకం అల్లనేరేడు వెరైటీపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుపై దాదాపు ఎనిమిది సంవత్సరాలకు పైగా సాగిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయని చెబుతున్నారు. ఈ కొత్త వెరైటీని త్వరలో ప్రకటించేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
దిగుబడి కూడా ఎక్కువే..
బీడు భూముల్లో సైతం ఈ పంట పండుతుంది. నీటి సౌకర్యం ఉన్నా.. లేకపోయినా నిలదొక్కుకుంటుంది. ఒక ఎకరంలో సుమారు 150 వరకు ఈ చెట్లు నాటొచ్చు. ఇప్పుడున్న వెరైటీల్లో ఒక్కో చెట్టుకు సుమారు 80 కిలోల వరకు దిగుబడి ఉండగా, ఈ కొత్త వెరైటీలో 100 నుంచి 120 కేజీల వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు ఆదాయం సుమారు 40 శాతం వరకు పెరుగుతుందని అంటున్నారు. సంవత్సరానికి ఒకసారే ఈ పంట చేతికందుతుంది. నాటిన ఏడేళ్ల తర్వాత ఈ పంట రాక ప్రారంభమవుతుందని, సుమారు 40 సంవత్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుందని చెబుతున్నారు.
ఔషధ ఫలంగా పేరు..
ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఈ పండ్లు మార్కెట్‌లోకి అమ్మకానికి వస్తుంటాయి. అల్లనేరేడును ఔషధఫలంగా కూడా పిలుస్తారు. మధుమేహ రోగులకు ఈ పండు ఎంతో మేలుచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పంట తెలంగాణతో పాటు, ఏపీ, అస్సాం, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో సాగవుతోంది.