ప్రముఖులతో పాఠాలు

New Teaching System Available To Degree Students - Sakshi

బీఏ ఆనర్స్‌తో సరికొత్త ప్రయోగం

క్లాసు రూం కన్నా బాహ్య ప్రపంచమే చదువు

కోర్సును ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

తొలుత కోఠి ఉమెన్స్‌ కాలేజీ, నిజామ్‌ కాలేజీలో..

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్‌ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌ కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు.

ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్‌ కాలేజీలో బీఏ ఆనర్స్‌ (పొలిటికల్‌), నిజామ్‌ కాలేజీలో బీఏ ఆనర్స్‌ (ఎకనామిక్స్‌)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్‌ మూడో దశ కౌన్సెలింగ్‌లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు.

ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ  సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకట రమణ పాల్గొన్నారు.  

కోర్సు లక్ష్యం ఇదీ..
ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్‌ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్‌ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్‌ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్‌ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్‌ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్‌కుమార్‌ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్‌ తెస్తున్నట్టు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top