
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రేపు సీఎం రేవంత్‌రెడ్డితో పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఇ చ్చిన, ఇస్తున్న కార్డులు 5,61,343
ఈ కార్డుల పంపిణీతో రాష్ట్రంలో 84 శాతం మందికి ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత అధికారికంగా సోమవారం కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. మంత్రులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ జనవరి 26 తర్వాత మొదలైన కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు కొత్తగా జారీ చేసిన, చేస్తున్న కార్డుల సంఖ్య 5,61,343. పాత కార్డుల్లోని డూప్లికేట్ పేర్లు తొలగించిన తర్వాత..ప్రస్తుతం కార్డుల్లో సభ్యుల సంఖ్య 3,09,30,911గా తేల్చారు.
ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడే...
పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల స్థానంలో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. అప్పట్లో రాష్ట్రంలో సుమారు 55 లక్షల కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జారీ చేయగా, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడప్పుడు జారీ చేసిన కార్డులు, తొలగించిన కార్డులు పోగా 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త కార్డుల జారీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత 24 మే నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్‌లైన్‌లో జారీ చేశారు.
దీంతో ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సభ్యులను చేర్చుకుంటూ, పాత రేషన్‌కార్డుల్లోని ఉమ్మడి కుటుంబాల్లో పెళ్లిళ్లు అయిన వారిని, ఇళ్లల్లో లేని వారిని తొలగించగా, రాష్ట్రంలో రేషన్ పొందేందుకు అర్హులుగా 3.09 కోట్లుగా నిర్ధారించినట్టు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
పది జిల్లాల్లో అత్యధిక కార్డులు
పది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో 31,772 కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా 6,67,778 రేషన్‌కార్డులు ఉన్న జిల్లాగా హైదరాబాద్, అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా 96,982 కార్డులతో ములుగు ఉంది.
5,61,343 కార్డుదారులకు ప్రయోజనం : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో కొత్తగా 5,61343 రేషన్‌కార్డులు అందజేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా 45,34,430 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. పాతకార్డుల్లో పేర్ల చేర్పు ద్వారా మరో 28,32,719మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
మొత్తంగా కార్డుల సంఖ్య 95,56,625
సన్నబియ్యం ఇచ్చేది 3,09,30,911 మందికి
13 ఏళ్ల తర్వాత కార్డు
నాకు వివాహమై 13 ఏళ్లు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఇరవై ముప్పై సార్లు మీసేవ కేంద్రంలో, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఈసారి దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు కార్డు వస్తోంది. – బూరి రేణుక, మొల్కపట్నం, నల్లగొండ
సంతోషంగా ఉంది
చేనేత కార్మికులుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. నాలుగైదేళ్లుగా కార్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గతంలోనూ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా రాలేదు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాం. కార్డు అప్రూవ్ అయ్యింది. – చెరుపల్లి నవీన, గట్టుప్పల్, నల్లగొండ
ఇప్పటికొచ్చింది
నాకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం రెండుసార్లు దరఖాస్తు చేశా. అయినా రాలేదు. మొత్తానికి ఇప్పుడు అప్రూవ్ అయ్యింది. – బొందల విక్రం, తుమ్మల పెన్‌పహాడ్, సూర్యాపేట