బాధితుల నుంచి వివరాలు సేకరించిన ప్రత్యేక బృందం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు ఎడమ చేయిని భుజం వరకు తొలగించిన ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, పీడియాట్రిక్ ప్రొఫెసర్, వరంగల్ ఎంజీఎం పీడియాట్రిక్ ప్రొఫెసర్‌తో కూడిన త్రీమెన్ కమిటీ మంగళవారం ఎంసీహెచ్‌కు వచ్చింది.
ఈ సందర్భంగా ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)లో ఇతరులను అనుమతించకుండా శిశువు తల్లితో మాట్లాడి ఎప్పుడు చేర్పించారు? ఎలాంటి చికిత్స ఇచ్చారు? చేయి వాపును గుర్తించి సమాచారం ఇస్తే ఎలా స్పందించారనే వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపై వివరాలన్నీ రాతపూర్వకంగా తీసుకున్నారని సమాచారం. అంతేకాక శిశువుకు ఎస్‌ఎన్‌సీయూ చికిత్స సమయాన విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని వేర్వేరుగా విచారించడమే కాక చికిత్స వివరాలు ఆరా తీస్తూ చేయి వాపు వచ్చి నల్లగా తయారైనా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించినట్లు తెలిసింది.
రాత్రి పొద్దుపోయే వరకు విచారణ జరగగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌తో పాటు ఆర్‌ఎంఓ రాంబాబు ఉన్నారు. కాగా విచారణ విషయం తెలిసి ప్రజా సంఘాల నాయకులు అక్కడకు చేరుకొని బాధ్యులైన వైద్యులు, సిబ్బందిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, త్రీమెన్ కమిటీ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాక ఆపై హెచ్‌ఆర్‌సీకి పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు.


