
త్వరలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
కాళోజీ విశ్వవిద్యాలయం కసరత్తు
34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకు ఎన్‌ఎంసీ ఆమోదం
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పరిస్థితిపై కౌన్సిల్‌కు త్వరలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వీలైనంత త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి నీట్ ర్యాంకర్లకు సంబంధించిన సీడీని తీసుకువచ్చారు. సీడీలో ఉన్న.. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థులు, వారికి వచ్చిన మార్కులు, జాతీయ స్థాయిలో ర్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత, రెండు మూడురోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
అనంతరం ర్యాంకర్లు యూనివర్సిటీలో రిజి్రస్టేషన్ చేసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేసిన వెంటనే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నేతృత్వంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆలిండియా కోటా కింద ఎన్‌ఎంసీ కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, రాష్ట్ర ర్యాంకర్లకు కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుంది.
పూర్తయిన ప్రభుత్వ కళాశాలల రెన్యువల్
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ పూర్తి కావస్తోంది. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. మే నెలలో జరిపిన తనిఖీల సందర్భంగా 26 కాలేజీల నిర్వహణపై కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కళాశాలలను నిర్వహిస్తున్నారని, అనుబంధ ఆసుపత్రులలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, రోగులు లేరని, విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు అవసరమైన మౌలిక వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించి క్లాస్ తీసుకుంది. ఈ నేపథ్యంలో 26 కళాశాలల్లోని సీట్ల రెన్యువల్ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును, వెంటనే సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిని ఎన్‌ఎంసీకి అధికారులు వివరించారు. తర్వాత ఎన్‌ఎంసీ సూచనల మేరకు ఫ్యాకల్టీ పెంపు, కొత్త నియామకాలు, సౌకర్యాల మెరుగు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు సంబంధించి ఎన్‌ఎంసీ ఎలాంటి కోత విధించలేదు. అలాగే ఎలాంటి జరిమానాలూ విధించలేదు. ఈ నేపథ్యంలో 4,090 ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా వచ్చే సంవత్సరం కూడా కొనసాగనున్నాయి. ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియలో వేగం పెరిగిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
ప్రైవేటు మెడికల్ కళాశాలల తీరే వేరు..!
ప్రభుత్వ కళాశాలలను ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కృషి చేస్తుంటే, ప్రైవేటు కళాశాలలు నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరానికి రెన్యువల్ కోసం కాళోజీ వర్సిటీ గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా, పలు కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల జాడే లేదని, ఇష్టానుసారంగా నిర్వహణ సాగుతోందని తేలింది.
ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు తాత్కాలిక ఫ్యాకల్టీలతో పాఠాలు చెప్పడం తప్ప ప్రాక్టికల్స్ అంటే ఏంటో తెలియని పరిస్థితి మెజారిటీ కళాశాలల్లో ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. తనిఖీలు మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. అనంతరం నివేదికను ఎన్‌ఎంసీకి పంపిస్తే, ఎన్ని కళాశాలల్లో సీట్ల రెన్యువల్‌కు అనుమ తి వస్తుందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల తనిఖీలతో సంబంధం లేకుండా స్టేట్ ర్యాంకులను నిర్ణయించి, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని వర్సిటీ భావిస్తున్నట్లు సమాచారం.