నవీన్ తల్లిదండ్రులకు హరి తండ్రి క్షమాపణలు.. పెద్దోడు అప్పుడు అలా, చిన్నోడు ఇప్పుడు ఇలా!

Naveen Case Updates: Accused Father Apology To Victim Parents - Sakshi

సాక్షి, వరంగల్: ఒకరేమో అనుమానంతో ఉన్మాదిగా మారిపోయి నమ్మిన స్నేహితుడినే కడతేర్చాడు. మరొకరేమో.. ఆ ఘాతుకంలో ప్రాణం పొగొట్టుకున్నాడు. హరిహరకృష్ణ-నవీన్‌లు ఇద్దరూ.. కన్నవాళ్లకూ పుట్టెడు దుఃఖం మిగిల్చారు. నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ విద్యార్థి నవీన్‌ హత్యోదంతం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడు హరిహరకృష్ణ తల్లిదండ్రులనూ పోలీసులు ప్రశ్నించగా.. మరోవైపు మీడియా వద్ద తండ్రి పేరాల ప్రభాకర్‌ తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. 

హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్లోని కరీమాబాద్. తండ్రీ పేరాల ప్రభాకర్ ఆర్ఎంపీ డాక్టర్, తల్లి గృహిణి. ప్రభాకర్‌ స్థానికంగా ఓ క్లినిక్‌ నడుపుతున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నవాడు హరిహరకృష్ణ. పెద్దకొడుకు ముఖేష్ కృష్ణ 2010లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే.. ముఖేష్ కృష్ణ 2011 జూన్ 15న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నోడు సక్రమంగా పెరగాలని ఆ తల్లిదండ్రులు భావించారు. 

అందుకే దూరంగా హైదరాబాద్‌లో చదివిస్తున్నారు. సుమారు 14 ఏళ్ళ నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు హరిహరకృష్ణ.  ఈ క్రమంలోనే నవీన్‌తో స్నేహం ఏర్పడి.. ఇద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు. అలాంటి స్నేహితుల మధ్య అమ్మాయి కోసం వైరం ఏర్పడి.. చంపేంత దాకా వెళ్లింది!. అయితే తన కొడుకు చేసింది ముమ్మాటికీ నేరమేనని అంగీకరించిన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్‌..  నవీన్ తల్లిదండ్రులను క్షమించమని వేడుకుంటున్నాడు.

‘‘ఐదు నెలల క్రితమే ఐదారుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకున్నారు. అక్క ఇల్లు.. ఉండగా రూమ్ ఎందుకు తీసుకున్నావని అడిగితే అందరం కలిసి చదువుకుంటున్నామని చెప్పాడు. మహాశివరాత్రి రోజున వరంగల్ కు వచ్చాడు. ఆరోజు ఫోన్లు బాగా రావడంతో  ఆందోళనకరంగా కనిపించాడు. ఏమైందని అడిగితే.. ఏమీ లేదంటూ వరంగల్ నుండి హైదరాబాద్‌కు  వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదు. అప్పటికే నవీన్ కనపడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. అందుకే మా అబ్బాయి కూడా కనపడకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాం. చివరికి.. 

ఈ నెల 23వ తేదీన వరంగల్ వచ్చాడు. ఏం జరిగిందని నిలదీస్తే అప్పుడు చెప్పాడు. నవీన్‌కు తనకు మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో నవీన్‌ చనిపోయాడని చెప్పాడు. తీవ్రంగా మందలించి.. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సూచించాను. స్థానికంగా మిల్స్‌ కాలనీ పోలీసుల దగ్గరకు వెళ్దామంటే.. లేదు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అలాగే చేశాడు. 

ఈ హత్య మా అబ్బాయి ఒక్కడే చేసినట్లు అనిపించడం లేదు. ఇంకా ఇంకొందరు ఉండవచ్చు. అమ్మాయి కోసం హత్య అంటున్నారు. కాబట్టి, ఆమెను కూడా విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మా అబ్బాయికి నేర చరిత్ర లేదు. గంజాయి తీసుకోడు. మద్యం తాగే అలవాటు ఉంది. ఆ  మత్తులో హత్య చేశాడని భావిస్తున్నాను. చదువులో క్లెవర్‌ స్టూడెంట్‌. ఏదో జరిగి ఉంటుందనే అనుమానం ఉంది. పెద్ద కొడుకు ఆత్మహత్య.. చిన్న కొడుకు హత్య కేసులో జైలు పాలుకావడంతో హరిహరకృష్ణ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top