బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం

National Scheme for PM Poshan: Ragi Malt, Moong, Jaggery to Include Midday Meal - Sakshi

రాష్ట్రాలకు ప్రతిపాదనలు.. సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు కోరిన కేంద్రం

ఈ ఏడాది నుంచే అమలుకు రంగం సిద్ధం

జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం నిర్ణయం

అదనపు నిధులు అవసరమంటున్న విద్యాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని (ప్రధానమంత్రి పోషక్‌ పథకం) సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచించింది. విద్యార్థులందరికీ మధ్యాహ్నం పోషకాలు ఎక్కువగా ఉండే రాగిజావను ఇవ్వాలని, దీంతోపాటే మొలకలు, బెల్లం అందించాలని పేర్కొంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిఉందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంటున్నారు.

దీనికి అదనపు నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదని విద్యాశాఖలో అదనపు డైరెక్టర్‌ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. గతంలో కూడా మధ్యాహ్నం భోజనంతోపాటు పల్లీ పట్టీ ఇవ్వాలని కేంద్రం సూచించిందని, పెరిగిన ధరల ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యం కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాగిజావను విధిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంనుంచి ఒత్తిడి వస్తున్నట్టు చెప్పాయి. ఇప్పుడిచ్చే ఆహారంలో స్వల్ప మార్పులు చేసి రాగిజావ, బెల్లం, మొలకలు అందించే విషయం పరిశీలిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. 

జాతీయ సర్వే ప్రకారమే.. 
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్రస్థాయిలో కొన్నేళ్లుగా తరచూ సర్వేలు చేస్తున్నారు. స్కూలు సమయానికి విద్యార్థుల కుటుంబాల్లో సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం హడావిడిగా ఉదయం వెళ్లాల్సి రావడం, విద్యార్థులు కూడా ఇంట్లో ఉన్నదేదో తిని వస్తున్నారని, దీంతో చాలామందిలో పోషకాహార లోపం కన్పిస్తోందని వెల్లడైంది. 

ఐదేళ్లుగా కనీసం 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. 32 శాతం మందిలో పోషక విలువలు లోపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. వీళ్లంతా ఎక్కువ రోజులు స్కూలుకు హాజరవ్వడం లేదని, ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బడిలోనే పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా రాగిజావ ఇవ్వాలని భావిస్తున్నారు. దీన్ని రోజూ ఇవ్వడమా? వారంలో కొన్ని రోజులు ఇవ్వడమా? అనే దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు.  

నిధుల సర్దుబాటు ఎలా? 
మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజుకో విధంగా ఆహారం ఇస్తున్నారు. వారానికి మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో ఆకు కూరలు, కాయగూరలు, సాంబార్, కిచిడీ ఇలా పలు రకాలుగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం మెనూ ప్రకారం ధరలను నిర్ణయిస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవి ఉండటం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.6 ఉంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రూ.2 మాత్రమే ఉంటోంది. దీంతో నిధుల సర్దుబాటు సమస్య వస్తోంది. ఇప్పుడు కూడా రాగిజావ, మొలకల కోసం ప్రత్యేక నిధులు అవసరమవుతాయని, లేని పక్షంలో పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. (చదవండి: అంచు చీరలే ఆ‘దారం’)   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top