దావత్‌ @మునుగోడు!.. నాటుకోడి మాంసం,  మద్యం, కల్లుతో విందులు

Munugode Bypoll: Leaders Parties Natu Kodi Chicken Liquor Craze - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ‘మనుగోడు పోదాం చలో..చలో.. ఎంజాయ్‌ చేద్దాం పదో.. పదో’.. అనే నినాదం ప్రస్తుతం జిల్లాలో మార్మోగుతోంది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలక్షన్‌ పుణ్యాన రాజకీయ పార్టీల నేతలు పండుగ చేసుంటున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే ఆయా పార్టీల శ్రేణులకు కలిసొచ్చింది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిత్యం వారికి కేటాయించిన గ్రామాల్లో డోర్‌ టు డోర్‌ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ నుంచి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి పలువురు నేతలు అక్కడకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రచార బాట పట్టారు. బీఎస్పీ నుంచి సైతం స్థానిక నేతలు తరలివెళ్తున్నారు. నిత్యం ఉదయం 7గంటలకే సాగర్‌రోడ్డు నుంచి మాల్‌ మీదుగా మునుగోడులోని గ్రామాలకు చేరుకుంటున్నారు. రాత్రి వేళ తిరిగి వస్తున్నారు. ఇలా వారం రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఆయా పార్టీలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్లు వందలాది మంది ప్రచారానికి వెళ్తున్నారు.   

నాటు కోడి.. భలే క్రేజీ  
మునుగోడు ప్రచారంలో విందు కోసం నాటు కోడి మాంసం క్రేజ్‌గా మారింది. నగరం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు విందులో కచ్చితంగా నాటు కోడి మాంసం ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే గ్రామాల్లో పార్టీ శ్రేణులకు ముందుగానే సమాచారం ఇచ్చి.. ఈ రోజు మా నేత వస్తున్నాడు.. నాటు కోడి మాంసం ఉండేలా చూడు బ్రదర్‌.. ఖర్చు ఎంతైనా చూసు్కందాం అని సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ నాటు కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది.

భోజనం ఏర్పాట్లు చేసే నిర్వాహకులు నిత్యం రంగారెడ్డి జిల్లాలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్, నల్గొండ జిల్లా పరిధిలోని చింతపల్లి, దేవరకొండ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్లి నాటుకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో మాంసం ఉన్న నాటు కోడి ధర రూ.2 వేలు పలుకుతోంది. రెండు కిలోల కోడిని రూ.5 వేలకు పైగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. నాటుకోడి మాంసంతో పాటు విలువైన మద్యం, కల్లు, మటన్, చికెన్‌తో విందు ఆరగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, చేతి ఖర్చుల కోసం నిత్యం రూ.వేలల్లో జేబు నింపుకొంటున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తమకు అక్కర్లేదు.. నిత్యం విందు భోజనం, చేతి ఖర్చులు అందుతున్నాయా..? లేదా..? అనే విధంగానే అన్ని పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు.   

చుక్కలు చూపిస్తున్న ఓటర్లు 
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జిల్లా నేతలకు మునుగోడు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఏ పార్టీ వారు వెళ్లి అడిగినా.. మీకే మా మద్దతు ఓటుకు రేటెంత అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు సదరు గ్రామాల్లోని తమ బంధువులు, తెలిసిన వాళ్లను తీసుకెళ్లి అయ్యా.. అమ్మా అంటూ బతిమాలుతున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల ఇళ్లల్లోనే విందులు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. మునుగోడు ఓటర్లను యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్‌ మండలాల పరిధి లోని గ్రామాలకు తీసుకువచ్చి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి.. మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు అని మద్యం తాగించి, డబ్బులు ఇస్తున్నారు.  మునుగోడు పోరుతో మద్యం, చికెన్, మటన్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.      

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top