
సాక్షి,నల్గొండ: సోషల్ మీడియా వినియోగం మంచికి ఉపయోగిస్తే వరం.. అదే చెడుకి ఉపయోగిస్తే శాపం. అలాంటి సోషల్ మీడియా అతి వినియోగం కొందరిని పెడదారులు పట్టేలా చేస్తుంటే.. మరికొందరిని భావోద్వేగాలకు గురి చేస్తుంది. నిండు జీవితాల్ని చేజేతులా నాశనం చేసేలా ఉసిగొల్పుతోంది. తాజాగా నల్గొండ బస్టాండ్‌లో జరిగిన సంఘటనలో.. ఓ తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడి మోజులో తన మాతృత్వాన్ని విస్మరించింది. కన్న కొడుకుని బస్టాండ్‌లో వదిలేసింది.అంతటితో ఆగలేదు.. ఇన్‌స్టా ప్రియుడితో కలిసి పరారయ్యింది. ఆ తర్వాత ఏమైందంటే
జిల్లా పోలీసుల వివరాల మేరకు..ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం అబం శుభం తెలియని పసిపిల్లాడిని బస్టాండ్‌లో వదిలేసి అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిందో మహిళ.ఆదివారం తన కొడుకుని తీసుకుని నల్గొండ బస్టాండ్‌కు వచ్చింది. బస్టాండ్‌లోని ఓ ప్రదేశంలోని కూర్చొబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి..అప్పటికే తనకోసం ఎదురు చూస్తున్న ప్రియుడితో కలిసి వెళ్లింది.
అయితే ఇప్పుడే వస్తానన్న అమ్మ రాకపోయే సరికి బాలుడిలో భయం మొదలైంది. అమ్మా.. అమ్మా అని పిలిచినా ఆలకించలేదు. దీంతో ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ సమయంలో ప్రయాణికులు బాలుడిని ఓదార్చి పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్‌కు చేరుకున్న పోలీసులు బాలుడిని సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆచూకీ తెలుసుకుని బాలుడిని తండ్రి చెంతకు చేర్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.