
ధ్రువీకరణ పత్రాల అందజేతలో ఈ కేంద్రాలది కీలక పాత్ర
తాజాగా వివాహ రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ ధ్రువీకరణల జారీ
గ్రేటర్ సహా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 1,327 మీ సేవ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లకుండానే వారికి అవసరమైన ధ్రువపత్రాలు అందించడంలో మీ సేవ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రేటర్ సహా శివారు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 1,327 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. తద్వారా ప్రభుత్వ పరిధిలోని 22 శాఖలకు సంబంధించిన 482 రకాల సర్వీసులు లభిస్తుండటంతో గ్రేటర్ సహా శివారు జిల్లాల ప్రజలకు వెసులుబాటు కలగటంతోపాటు వ్యయ, దూర భారం తగ్గుతోంది. తాజాగా మరో రెండు రకాల సేవలను ఈ జాబితాలో చేర్చడంతో సంబంధిత ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. వివాహ రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
వివాహ ధ్రువీకరణ పత్రం కోసం..
వివాహ ధ్రువీకరణ పత్రం పలు సందర్భాల్లో అత్యవసరం. దీంతో వివాహ బంధానికి చట్టపరంగా గుర్తింపు లభిస్తోంది. దరఖాస్తుకు భార్యాభర్తల ఆధార్‌కార్డులు, వయసు, పుట్టిన తేదీ, కుల, ఆదాయం, పదోతరగతి ధ్రువీకరణ పత్రాలతో పాటు పెళ్లి ఫొటోలు, వివాహ ఆహ్వాన కార్డులు అవసరం. పెళ్లి చేసుకున్న ప్రాంతం, చిరునామా, వివాహ తేదీ, భార్యాభర్తల మతం, వృత్తి, శాశ్వత చిరునామా, దరఖాస్తుదారుల తల్లిదండ్రుల పేర్లు, సాక్షుల వివరాలు, వారి చిరునామాను దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. న్యాయవాది ద్వారా తీసుకున్న నోటరీ ఉండాలి. దేవాలయంలో పెళ్లి చేసుకుంటే ఆలయం నుంచి, ఫంక్షన్ హాలులో చేసుకుంటే సంబంధిత యాజమాన్యం నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. దరఖాస్తుతో రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. తర్వాత స్లాట్ బుక్ చేసుకుని ఆ తేదీన సబ్ రిజిస్ట్రార్ ఎదుట ముగ్గురు సాక్షులతో పాటు భార్యాభర్తలు హాజరు కావాల్సి ఉంటుంది. దరఖాస్తును సబ్ రిజి్రస్టార్ పరిశీలించి వివాహ ధ్రువపత్రం జారీ చేస్తారు.
మార్కెట్ విలువ సర్టిఫికేట్ కు..
అపార్టుమెంట్, ఇంటి స్థలం, ఇతర ఆస్తులపై ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను నిర్ధారించుకోవడానికి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవటాని కి అవకాశం ఉంది. దరఖాస్తు పరిశీలన అనంతరంసబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం జారీ కానుంది. దరఖాస్తుదారు ఆధార్‌కార్డు, ఇల్లు, స్థలం పత్రాలు, పన్ను రసీదు, జిల్లా, గ్రామం వివరాలను సమరి్పంచాల్సి ఉంటోంది.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం కొత్తగా రెండు రకాల సేవలను మీసేవ జాబితాలో చేర్చిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ అధికార వర్గాలు సూచించాయి. ప్రజలకు పాలన చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, మీ సేవ కేంద్రాల ద్వారా సులభంగా, వేగంగా పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొంటున్నాయి.