MLC Kavitha Letter To CBI Said Will Not Attend Hearing On December 6th - Sakshi
Sakshi News home page

ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు.. 6న విచారణకు హాజరుకాలేను: కవిత

Dec 5 2022 10:00 AM | Updated on Dec 5 2022 5:40 PM

MLC Kavitha Letter To CBI Said Will Not Attend Hearing On 6th - Sakshi

సాక్షి, హైదరాబాద్:  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. 

సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్‌లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన  పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల  ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు.  

ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన  ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు.

ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! 

Advertisement
 
Advertisement
Advertisement