నేడు కొత్త పార్టీ ప్రకటించనున్న కవిత
గత ఏడాది తాను తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంపై అసంతృప్తి
కేసీఆర్ చుట్టూ చేరిన దెయ్యాలే కారణం అంటూ ధ్వజం
హరీశ్‌రావు, సంతోష్ లపై తీవ్ర ఆరోపణలతో బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్
శనివారం మేడ్చల్ జిల్లాలో పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నాయకత్వంతో విభేదించి బయటకు వచ్చిన.. పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత శనివారం సొంత పార్టీని ప్రారంభిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ అధినేత ప్రసంగంలో లోపాలను ఎత్తిచూపుతూ తాను తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లేఖ లీక్ కావడానికి కేసీఆర్ చుట్టూ చేరిన దెయ్యాలే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆనాటి నుంచి పార్టీపై, నాయకత్వంపై విమర్శనా్రస్తాలు సంధిస్తూ ఆరోపణలు రోజురోజుకు పెంచుతుండడంతో పాటు.. పార్టీలో కీలక నేతలు హరీశ్‌రావు, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ గత సెప్టెంబర్ 2న కవితను బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసింది. అయితే ఆ మరుసటి రోజునే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. అప్పటి నుంచి సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తూ వచి్చన కవిత.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’పేరిట ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ జెండా, ఎజెండాను శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు.
ఉదయం నుంచే సంబురాలు
ఉదయం 8 గంటలకే అక్కడి ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మేరకు సంబురాలు ప్రారంభం కానున్నాయి. కవిత ఉదయం 7.30కు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి 8.15కు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.30కు మునీరాబాద్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటలకు వేదిక పక్కనే ఏర్పాటు చేసిన గద్దెపై పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
కన్వెన్షన్ సెంటర్‌తో పాటు పక్కనే ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంగణానికి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారు. స్వాగత ద్వారాలకు, భోజనశాలలకు కూడా పేర్లు పెట్టారు. సభ అనంతరం ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అరి్పంచిన అనంతరం కవిత తిరిగి బంజారాహిల్స్ నివాసానికి చేరుకుంటారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో 5 నెలలు జైల్లో..
2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టై సుమారు 5 నెలల పాటు ఢిల్లీ తీహార్‌లో జైలు జీవితం గడిపారు. ఆగస్టులో విడుదల కాగా ఇటీవల సీబీఐ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరికొందరితో పాటు కవితకు కూడా ఈ కేసులో క్లీన్‌చిట్ ఇచి్చంది.
తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక కోణం
కవిత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అమెరికా నుంచి తిరిగి వచ్చారు. 2006లో ఉద్యమానికి సాంస్కృతిక కోణాన్ని జోడించారు. బతుకమ్మ సంబురాలతో పాటు ఇతర సాంస్కృతిక, రాజకీయ కార్యకలాపాల ద్వారా క్రియాశీలంగా పనిచేశారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2019లో ఓటమి అనంతరం 2020లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.


