స్త్రీల ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీవాసవీ కన్యక | symbol of women selfrespect Sri Vasavi Kanyaka special story | Sakshi
Sakshi News home page

స్త్రీల ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీవాసవీ కన్యక

Apr 23 2026 4:42 PM | Updated on Apr 23 2026 4:42 PM

symbol of women selfrespect Sri Vasavi Kanyaka special story

26 ఆదివారం – శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి 

వైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి. పదకొండవ శతాబ్దంలో పెనుగొండను పాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబల ముద్దుబిడ్డగా ఆమె జన్మించింది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యజ్ఞ ఫలితంగా విరూపాక్షుడు అనే కవల సోదరునితో బాటు ప్రభవించిన కన్యక అందచందాలతో, విద్యావినయాలు, గుణ గణాలతోబాటు ఆధ్యాత్మిక విలువలనూ కలిగి అందరి మన్ననలనూ  పొందింది. వివాహం చేసుకోకుండా కన్యగానే జీవించాలనే ప్రగాఢేచ్ఛ ఆమె తల్లితండ్రులను కూడా విస్మితులను చేసింది. ఆమె నిర్ణయానికి తలొగ్గి ఆమె సోదరుడు, విరూపాక్షుని వివాహం రత్నావతితో అతి వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు. 

ఇలా ఉండగా... వేంగిరాజ్య పాలకుడు,పాండవుల వంశంలోని వాడైన నాటి చాళుక్యరాజు విష్ణువర్ధనుడు తన సామంతరాజ్యమైన పెనుగొండకు పర్యటనకు రాగా, కుసుమశ్రేష్ఠి, తదితరులు ఆ చక్రవర్తికి సకల రాజోచిత మర్యాదలనూ చేశారు. విమలాదిత్యు డనే మరొక పేరూ కలిగిన విష్ణువర్ధనుడు పెనుగొండ వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంతకంటే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెడుతున్న వాసవాంబ అసామాన్యమైన సౌందర్యానికి విమోహితుడైపోయాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించవలసిందిగా కుసుమ శ్రేష్ఠికి తన మంత్రులతో కబురంపాడు. 

వయసులో వాసవాంబ కన్నా చాలా పెద్దవాడు, పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఉన్నవాడు అయిన చక్రవర్తి వాసవాంబను కోరడం కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి నచ్చలేదు. పైగా తన కూతురు కన్యగానే జీవింపదలచి ఉంది. అలాగని బలవంతుడైన చక్రవర్తిని ఎదిరించనూ లేడు. దిక్కుతోచని స్థితిలో కుసుమ శ్రేష్ఠి తన కులగురువైన భాస్కరాచార్యుని అధ్వర్యంలో 714 గోత్రాలుగా విస్తరించి ఉన్న తమ ఆర్య వైశ్యులతో సమావేశమయ్యాడు. వారిలో 612 గోత్రాలవారు విష్ణువర్ధనుని ఎదిరించడం బలవద్విరోధాన్ని కొని తెచ్చుకోవడమేననీ, వాసవాంబను అతనికిచ్చి పెండ్లి జరిపిస్తే యుద్ధప్రమాదం, అందువలన కలిగే కులక్షయం అనే ముప్పూ తప్పుతాయని భావించగా; 102 గోత్రాల వారు మాత్రం కుల ధర్మానికి విరుద్ధంగా, దైవాంశగా భావించబడుతున్న వాసవిని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చక్రవర్తికి అప్పగించడం తప్పని అభిప్రాయ పడ్డారు. ఇంతలో అనూహ్యంగా వాసవీదేవి ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించింది. ‘అన్నలారా, తండ్రులారా! ఒక వినూత్న ప్రణాళికతో చక్రవర్తిని దెబ్బ తీయాలనుకొంటున్నాను. నేనతనిని నిరాకరిస్తే, అతడు మనపైకి దండెత్తి వచ్చి మన సైన్యాన్ని, పౌరులను ఊచ కోత కోస్తాడు. అహింస, సత్యాగ్రహం అనే విధానంతో మనలను మనం ఆత్మార్పణ గావించుకొని అతనికి బుద్ధి చెబుదాం. దృఢమైన సంకల్పదీక్షతో నన్ను అనుసరించ గలవారు మాత్రమే ఈ నా  పోరాటంలోపాల్గొనగలరు’ అని ఆమె పలికిన పలుకులకు ఆమె తల్లిదండ్రులతోబాటు, 102 గోత్రాల వారు తమ అంగీకారాన్ని తెలిపారు.

గోదావరీ తీరంలో బ్రహ్మకుండమనేపావన ప్రదేశంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘ శుద్ధ పాడ్యమి. తమ కన్ను పడిన కన్నె పిల్లలు తమ వశం కావలసిందే అని విర్రవీగే నాటి రాజుల ఆగడాలకు చరమ గీతం పాడడానికి; ఆడపిల్లల అభిప్రాయాలకూ విలువనివ్వాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి; ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ్ర΄ాణాలు గొప్పవి కావని నిరూపించడానికి, ‘ఆత్మార్పణ‘ మార్గాన్ని ఎంచుకొన్నది వాసవీమాత. తనతోబాటూ ఆ యజ్ఞంలో ఆహుతి కావడానికి సంసిద్ధులై ఉన్న 102 గోత్రాల వారికి తన నిజరూపాన్ని ప్రదర్శించింది ఆమె. తనతోబాటు తన 102 గోత్రాల వారికీ మోక్షం కావాలని కోరుకొన్న ‘సమాధి’ అనే వైశ్యశ్రేష్ఠుడే ఇప్పుడు తన తండ్రియైన కుసుమ శ్రేష్ఠి అంటూ తమ జన్మవృత్తాంతాన్ని వివరించింది వాసవీదేవి.

దేశభక్తి, నిజాయితీ, దేహ బలం, బుద్ధిబలం, సమాజసేవల గురించి ప్రబోధించింది. ‘రాజా! చేతనైనే నన్ను ఇప్పుడు చెరబట్టు’ అంటూ అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యం చూసి తన గర్వం మట్టిలో కలిసిపోగా, రక్తం కక్కుకొని, తల పగిలి రాజు మరణించాడు. కోరుకొన్న కన్య లభించక పోగా అపకీర్తి, ఆకస్మిక మరణం రాజును వరించాయి. 

గురజాడ వారు అన్నట్లు ‘పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను/ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‌‘. వాసవీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి  పోయాయి. విషయం తెలుసుకొని విష్ణువర్ధన చక్రవర్తి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు తరలిరాగా, విరూపాక్షుడు అతడిని స్నేహపూర్వకంగా పరామర్శించి, ‘గతాన్ని మరచి నవ్యమైన భవిష్యత్తును నిర్మించుకొందాం‘ అంటూ చేయి కలిపాడు. అంగీకరించిన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలోని నగరేశ్వర స్వామి దేవస్థానం లోనే వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిపాడు. అప్పటినుండీ వైశ్యుల కుల దేవతగా వాసవీ కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలందుకొంటూ ఉంది. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఆమెకు ఆలయాలు వెలిశాయి.
డాక్టర్‌ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

 

Advertisement
 
Advertisement
Advertisement