ఢిల్లీ-పంజాబ్‌ మ్యాచ్‌ వివాదాస్పదం.. బీసీసీఐపై విమర్శలు | BCCI Commits Biggest Blunder Of IPL 2026, Businessman Arrested In Delhi Liquor Case Seen Awarding Madhav Tiwari | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-పంజాబ్‌ మ్యాచ్‌ వివాదాస్పదం.. బీసీసీఐపై విమర్శలు

May 12 2026 1:33 PM | Updated on May 12 2026 1:38 PM

BCCI Commits Biggest Blunder Of IPL 2026, Businessman Arrested In Delhi Liquor Case Seen Awarding Madhav Tiwari

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వివాదాస్సదమైంది. ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం వివాదానికి దారి తీసింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆల్‌రౌండర్ మాధవ్‌ తివారి అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మాధవ్‌కు ఈ అవార్డు అందజేసిన వ్యక్తి ఓ వివాదాస్పద కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతని పేరు గౌతమ్‌ మల్హోత్రా. పంజాబ్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపించింది. ఈ కేసులో అతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.

ఆయనపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసులు నమోదయ్యాయి. మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సంబంధించిన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది.

లైవ్‌లా బిజ్ నివేదికల ప్రకారం, గౌతమ్ మల్హోత్రా రూ.2.5 కోట్ల లంచాల వ్యవహారంలో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే లిక్కర్ వ్యాపారంలో అక్రమ లాభాలు పొందినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే అనంతరం సరిపడా ఆధారాలు లేవన్న కారణంతో 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించింది.

అయినా సరే, ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని ఐపీఎల్ అవార్డు కార్యక్రమానికి ఎంపిక చేయడం బీసీసీఐ నిర్లక్ష్యానికి నిదర్శనమని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం క్లియరెన్స్‌  లభించిన వ్యక్తిని ఆహ్వానించడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మాధవ్ తివారి అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో ఓటమి ఖాయమనే స్థితికి చేరింది.

కానీ కెప్టెన్ అక్షర్‌ పటేల్‌, అనుభవజ్ఞుడు డేవిడ్‌ మిల్లర్‌ జట్టును పోటీలో నిలబెట్టారు. చివర్లో అశుతోష్‌ శర్మ, మాధవ్ తివారీ, ఆకిబ్‌ నబీ వేగంగా పరుగులు చేసి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో మాధవ్ తివారీ రెండు కీలక వికెట్లు తీసుకోవడంతో పాటు కేవలం 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement