అరవింద్‌ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు | Delhi High Court Initiates Contempt Action Against Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

అరవింద్‌ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు

May 14 2026 8:21 PM | Updated on May 14 2026 9:25 PM

Delhi High Court Initiates Contempt Action Against Arvind Kejriwal

ఢిల్లీ:  ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు  ఆదేశించింది.  జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మను , కోర్టును లక్ష్యంగా చేసుకుని సందేహాలను రేకెత్తిస్తూ  సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలపై  అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మాజీ ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లపై కోర్టు ధిక్కరణ చట్టం కింద క్రిమినల్ చర్యలను ప్రారంభించాలని కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.

జస్టిస్  స్వర్ణ కాంత శర్మ ముందు తాము హాజరు కాబోమనే విషయాన్ని  కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్‌ నాయకులు ఆన్‌లైన్‌లో లేఖలు షేర్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశించారు. దీనిలో భాగంగా జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ సైతం.. తనను ఎవరూ బెదిరించలేరంటూ గట్టిగా హెచ్చరించారు.

‘ఎడిటెడ్‌ వీడియోలతో నా కుటుంబ సభ్యులను  నిందించారు... ఇది నన్ను మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థను భయపెట్టడానికే చేశారు. నన్ను ఎవరూ బెదిరించలేరు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనూహ్య నిర్ణయాలతో కోర్టు విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందుకు విచారణకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. దాంతో ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. 

విచారణకు  స్వర్ణకాంత శర్మ దూరం..
ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు స్వర్ణకాంత్ శర్మ వెల్లడించారు. న్యాయ క్రమశిక్షణ లో భాగంగా తాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ గతంలోనే కొట్టేసిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరొక న్యాయమూర్తి కి కేటాయించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement