
పిల్లలమర్రిని సందర్శించిన పోటీదారులు
మహా వృక్షాన్ని చూసి మురిసిపోయిన సుందరీమణులు
హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో పార్కు సందర్శన
ఏఐజీ ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించిన పోటీదారులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్/శంకర్‌పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్ శివార్లలోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు.
పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.
ప్రత్యేక గైడ్ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు.
మనసు దోచుకున్న ఎక్స్‌పీరియం..
హైదరాబాద్ శివారులోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్ వరల్డ్ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్ యూఎస్ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్‌పీరియం, సృజనాత్మక డిజైన్‌తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో తెలిపారు.
కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే..
తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు.