
పట్టు పరికిణీలు, చీరలు ధరించి.. నుదుట తిలకం దిద్దిన సుందరీమణులు
బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం
రామప్ప, వరంగల్‌కు వివిధ దేశాల అందాల భామలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు ఓరుగల్లు పర్యటనలో జిగేల్‌మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది.
సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు.
ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు.
ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆతీ్మయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు.
ఆలయ తీరుతెన్నులను తనివితీరా తిలకించి ఫిదా అయ్యారు. రామప్ప గార్డెన్‌లో అలేఖ్య పుంజాల శాస్త్రీయ నత్యం, రంజిత్ బృందం పేరిణి ప్రదర్శనలను వీక్షించిన అనంతరం..ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌లో డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు.
అతిథులకు మంత్రుల సన్మానం
వరంగల్ కోటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ సుందరీమణులకు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ఓరుగల్లు నిలువెత్తు నిదర్శనమన్నారు. రామప్ప గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ సాంస్కృతిక చారిత్రక కట్టడాలకు నిలయం ములుగు ప్రాంతమని, ఇక్కడకు సుందరీమణులు రావడం సంతోషంగా ఉందన్నారు.
వరంగల్ పర్యటన ఎప్పటికీ గుర్తుంటుంది
చారిత్రక సంపదకు నెలవైన వరంగల్ పర్యటన మాకు జీవితాంతం గుర్తుండే అనుభూతి. కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట అద్భుతంగా ఉంది. మాటల్లో దీన్ని వర్ణించలేం. రాణిరుద్రమదేవి గొప్పతనం ఇక్కడ కళ్లకు కట్టినట్టు కనిపించింది. కాకతీయుల పాలన గురించి తెలిపే సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన మాకెంతో అవగాహన కలిగించింది. ఇక్కడి ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోంది. చేనేత కలంకారి డ్రెస్ చూస్తే ఇక్కడి గొప్పతనం తెలుస్తోంది. చపాట మిర్చి చూసేందుకు బాగా ఉంది. ఇంకా టేస్ట్ కూడా ఆ రేంజ్‌లోనే ఉందనుకుంటున్నాం. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని మా దేశంలో వినిపిస్తాం.
–మిస్ వరల్డ్ పోటీదారులు