
యాదాద్రి: ప్రపంచ హెరిటేజ్ విలేజ్ భూదాన్ పోచంపల్లి, ఆధ్మాతిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో ఇవాళ ప్రపంచ సుందరీమణులు పర్యటించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ, పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల చీరలు, వస్త్రాలను పరిశీలించారు. ఇందు కోసం 13 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
చేనేత విశిష్టతను వివిధ దేశాల అందగత్తెలకు వివరించారు. మరోవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణశిలతో నిర్మితమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరీమణులకు వివరించారు.

కాగా, పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు నిన్న(బుధవారం) ఓరుగల్లు పర్యటనలో జిగేల్‌మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది.

సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.

అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు.