తెలంగాణను హెల్త్‌ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం | Sakshi
Sakshi News home page

తెలంగాణను హెల్త్‌ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం

Published Sat, Mar 9 2024 5:10 AM

minister rajanarasimha inaugurated dsa and cp lab in nims hospital - Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

నిమ్స్‌లో డీఎస్‌ఏ, క్రిటికల్‌ కేర్‌ సిమ్యులేషన్‌ ల్యాబ్‌లు ప్రారంభం 

39 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు  

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): తెలంగాణను హెల్త్‌ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్‌ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్‌ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్‌ఏ ల్యాబ్, యూఎస్‌ ఎయిడ్‌ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ సిమ్యులేషన్‌ స్కిల్‌ ల్యాబ్‌లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు.

స్కిల్‌ ల్యాబ్‌లో సీపీఆర్‌ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్‌ ఇమేజ్‌ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు.

నిమ్స్‌లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ సిమ్యులేషన్‌ సిల్క్‌ లాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్‌ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తు, నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్‌ ఎయిడ్‌ డాక్టర్‌ వరప్రసాద్, హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్‌ మార్త రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement