యువతను మోసగించేందుకే.. ‘రోజ్‌గార్‌ మేళా’పై కేటీఆర్‌

Minister KTR Terms Centre Rozgar Mela As Attempt To Deceive Youth - Sakshi

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం దగా చేస్తోంది 

కేంద్రం, బీజేపీపై తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది 

ప్రధాని మోదీకి మంత్రి లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: రోజ్‌గార్‌ మేళా పేరిట మీడియాలో ప్రచారం చేసుకోకుండా దేశంలోని నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు డిమాండ్‌ చేశారు. రోజ్‌గార్‌ మేళా కబేలాలో బలి పశువుల్లా యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల సమయంలో ప్రజలను మోసగించే ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగాల కల్పనలో మోసగిస్తే ప్రజలు కేంద్రం, బీజేపీపై త్వరలోనే తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. రోజ్‌గార్‌ మేళా పేరిట యువతను మోసగిస్తున్నారంటూ మంగళవారం ప్రధాని మోదీకి కేటీఆర్‌ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల భర్తీచే యని మోదీ గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు మరో ఏడాదిలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రోజ్‌గార్‌ మేళా పేరిట చేస్తు న్న దగాను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నా రు.

రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగం పెరగ్గా, కేవలం 75వేల ఉద్యోగాలతో రోజ్‌గార్‌ పేరిట నిరుద్యోగ యువతను మోదీ క్రూరంగా పరిహాసం చేస్తున్నా రని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లుగా 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా రోజ్‌గార్‌ మేళా పేరిట ఆటలాడటం సరైందికాదని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

అడ్డగోలు ఆర్థిక విధానాల వల్లే... 
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అంటూ 16 కోట్ల ఉద్యోగాలను 10 లక్షలకు కుదించి, అందు లో 75 వేల మందికి నియామక పత్రాలు అందజేసి ఆర్థిక వ్యవస్థ కష్టాలను ప్రస్తావించడంతో రోజ్‌గార్‌ హామీపై అనుమానాలు ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, రోజ్‌గార్‌ మేళా పేరిట ప్రచార ఆర్భాటాన్ని నిరుద్యోగులపై రుద్దకూడదన్నారు.

యువతకు ఉపాధి కల్పించా లని ఈ జూన్‌ 9న లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. యువతను మభ్య పెడుతున్న తీరు ‘నమో’అంటూ నమ్మించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, మరో 91 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు.

రాష్ట్రంలో 2.24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 16.5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని, 28 రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చిన ఉద్యోగాల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. 2014 నుంచి గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 7 లక్షలు ఉద్యోగాలు నింపి, మరో 16 లక్షలు భర్తీ చేయాల్సి ఉందని కేంద్రమే ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం జాబ్‌ కేలండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top