నుమాయిష్‌తో అపూర్వ అనుభూతి

Minister Harish Rao Inauguration Of 82nd All India Exhibition Numaish - Sakshi

మంత్రి హరీశ్‌ రావు

మినీభారత్‌గా తలపిస్తున్న ఎగ్జిబిషన్‌ సెంటర్‌

వచ్చే ఆదాయంతో విద్యాసంస్థలకు తోడ్పాటు

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–82 షురూ

సాక్షి, హైదరాబాద్‌: ‘‘పెరిగిన సాంకేతికతతో మొబైల్‌ ఫోన్‌లో ఆర్డర్స్‌ క్లిక్‌ చేస్తే వస్తువులు ఇంటి వద్దకు చేరవచ్చు. కానీ, నుమాయిష్‌లో వివిధ సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, నచ్చిన, మెచ్చిన వస్తువులను చూసి కొనుగోలు చేయడం ద్వారా పొందే అనుభూతిని మాత్రం కోల్పోతామని రాష్ట్రమంత్రి,, ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ అధ్యక్షుడు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)–82ను ఆయన మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలసి ప్రారంభించారు.

అక్కడ ఏర్పాటు చేసిన సాళ్లను సందర్శించి వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం వారు నుమాయిష్‌లోని టాయ్‌ట్రైన్‌లో ప్రయాణించారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో ప్రతి కొత్త సంవత్సరం హైదరాబాద్‌ నుమాయిష్‌ భాగమైపోయిందన్నారు. సామాజిక అనుబంధాన్ని కోల్పోకుండా నుమాయిష్‌ను సందిర్శంచి లభించే గొప్ప అనుభూతిని ఆస్వాదించాలని కోరారు. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌ వరకు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఎగ్జిబిషన్‌కు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేస్తారని, వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తుల స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ మినీభారత్‌ను తలపిస్తోందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నుమాయిష్‌ ప్రపంచంలో జరిగే వ్యాపార సమ్మేళనాల్లో ఒకటిని పేర్కొన్నారు.  

మహిళాసాధికారతకు తోడ్పాటు 
ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌ ద్వారా లభించే ఆదాయంతో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలకు నిధులు సమకూర్చి దాదాపు 30 వేలమందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు విద్యాసంస్థలు నడిపిస్తూ మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్నారు.

హైదరాబాద్‌లోనే కాకుండా మారుమూల నిర్మల్‌ వంటి దూర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభించి, ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు గుర్తు చేశారు. సుమారు రెండు వేల టీచింగ్‌– నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రతి ఏడాది దాదాపు పదివేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశవిదేశాల్లో ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని , వారు సొసైటీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎగ్జిబిషన్‌ ద్వారా లభించే ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తుందని పేర్కొన్నారు.

మిగతా జిల్లాలో కూడా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు విస్తరించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మట్లాడుతూ లాభాపేక్ష లేకుండా సొసైటీ సేవలు అభినందనీయమని, మళ్లీ పాత నుమాయిష్‌ రోజులు రావాలని ఆకాంక్షించారు. మంత్రి తలుసాని మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు నుంచి నుమాయిష్‌ నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో పలు విద్యసంస్థలు నడపడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ స్థలం విషయంలో చొరవ చూపినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో హజ్‌ కమిటీ చైర్మన్‌ సలీం, ఎగ్జిబిషన్‌ సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top