
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ వివాదం కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. నేటి నుండి వేములవాడ(Vemulawada Temple) రాజన్న దర్శనాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటన నేపథ్యంలో ఆలయ ఈవోపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మండిపడుతున్నారు. మరోవైపు.. ఆలయ ఆర్జిత సేవలను భీమన్న ఆలయానికి మార్చడాన్ని నిరసిస్తూ వేములవాడలో బీజేపీ శ్రేణులు.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే అన్ని రకాల ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు మాత్రమే నిర్వహించటం జరుగుతుందని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులందరూ దీనికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాల నిలిపివేత కొన్ని నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో దర్శనాల నిలిపివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఉన్నపళంగా భక్తుల దర్శనాలు నిలిపివేయడంపై సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులను భీమన్న దేవాలయానికి వెళ్ళ మనడంపై అభ్యంతరం తెలిపారు. ముందస్తుగా ప్రకటన చేయకుండా భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులకు బండి సంజయ్ ఫోన్ చేయడంతో మళ్లీ దర్శనానికి అధికారులు అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, ఆర్జిత సేవల తరలింపుపై సందిగ్ధత నెలకొంది.
మరోవైపు.. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా హడావిడిగా భీమన్న ఆలయానికి మార్చేస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆలయ ఆర్జిత సేవలను భీమన్న ఆలయానికి మార్చడాన్ని నిరసిస్తూ వేములవాడలో బీజేపీ శ్రేణులు.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు.