కరోనా పరీక్షలు.. మూడు రెట్లు | Medical Health Department Ramping Up Corona Diagnostic Tests | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షలు.. మూడు రెట్లు

Aug 29 2020 12:46 AM | Updated on Aug 29 2020 12:46 AM

Medical Health Department Ramping Up Corona Diagnostic Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్షల్లో వైద్య,ఆరోగ్యశాఖ దూసుకెళుతోంది. మొదట్లో కాస్తంత నెమ్మదిగా జరి గినా ఇప్పుడు స్పీడు పెంచింది. ఒక్క నెలలోనే 3 రెట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించింది. దీనికోసం గ్రామస్థాయి వరకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌  టెస్టులకు శ్రీకారం చుట్టింది. పల్లెల్లో జ్వర బాధితు లను గుర్తిస్తూ అనుమానితులను పట్టుకొచ్చి కరోనా పరీక్షలు చేయిస్తోంది. పీహెచ్‌సీ మొదలు హైదరా బాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా  పరీక్షలు విరివిగా జరుగుతున్నాయి. మరోవైపు మొబైల్‌ టెస్టుల కోసం బస్సులను ఏర్పాటు చేసి శాంపిళ్లను తీసుకొని పరీక్షలు చేస్తున్నారు. 

వచ్చే నెలలో 15 లక్షల యాంటిజెన్‌  టెస్టులు
ఈ నెల రోజుల్లోనే రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 చోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌  టెస్టులు, 16 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్‌ విధానంలో టెస్టులు జరుగు తున్నాయి. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో 31 చోట్ల పరీక్షలు చేస్తున్నారు. ఇలా భారీగా టెస్టులు చేయడంతోపాటు అదేస్థాయిలో కేసులూ వెలుగు చూస్తున్నాయి. గత నెల రోజుల్లోనే మూడు రెట్లకు పైగా కరోనా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించారు. అంతేకాదు ఒక్కరోజులో చేసే పరీక్షల సామర్థ్యం కూడా అదేస్థాయిలో పెరిగింది. వచ్చే నెలలో 15 లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌  టెస్టుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాటిని ఇప్పటికే కొనుగోలు చేసింది. విడతల వారీగా కిట్లు రాష్ట్రానికి చేరుకుంటాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు రోజుకు 10 వేల వరకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో వచ్చే నెలలో 18 లక్షల వరకు పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుంది.

పది లక్షల జనాభాకు 32,439 పరీక్షలు...
రాష్ట్రంలో గురువారం నాటికి ప్రతీ పది లక్షల జనాభాకు 32,439 పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మున్ముందు పది లక్షల్లో 50 వేల మందికి పరీక్షలు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు  తెలిపింది. అందుకే ఇంకా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు రెండుమూడు రోజులుగా హైదరాబాద్‌ ఉప్పుగూడ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారికి పరీక్షలు చేస్తున్నారు. కరోనా మెడికల్‌ క్యాంపులు నిర్వహించడం రాష్ట్రంలోనే మొదటిసారి అని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎండీ హెప్సీబా, డాక్టర్‌ రాగిణి వైద్య బృందం స్థానిక బస్టాప్‌లు, మార్కెట్లలో క్యాంపులు నిర్వహించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వచ్చే నెల గ్రామాల్లోనూ మెడికల్‌ క్యాంపులు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. తద్వారా వచ్చే నెలనాటికి రాష్ట్రంలో వైరస్‌ను తగ్గుముఖం పట్టించాలన్న కృతనిశ్చయంతో ఉంది. 
––––––––––––––––––––––––––
గత నెల 27 నాటికి రాష్ట్రంలో కరోనా పరీక్షలు: 3,79,081  
ఈ నెల 27వ తేదీ నాటికి మొత్తం టెస్టులు: 12,04,343 

గత నెల 27న చేసిన కరోనా పరీక్షలు: 21,839 
ఈ నెల 27న చేసిన టెస్టులు: 61,863 

శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ కేంద్రంలో కరోనా అనుమానిత 
మహిళ నుంచి శాంపిల్‌ సేకరిస్తున్న వైద్య సిబ్బంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement