అన్ని జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వే

Medical Health Department Decided To Conduct Public Health Profile Survey - Sakshi

అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డుల దిశగా సర్కారు సన్నాహాలు 

కొన్ని పరీక్షలు ఇళ్ల వద్ద.. మరికొన్ని పీహెచ్‌సీల్లో..

ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీన హెల్త్‌ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఇక అన్ని జిల్లాల్లోనూ వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని (హెల్త్‌ ప్రొఫైల్‌) సేకరిస్తారు.

వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్‌ కేటాయిస్తారు. తద్వారా ఆన్‌లైన్‌లో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశముంటుంది. హెల్త్‌ ప్రొఫైల్‌ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు అందజేస్తారు.  

ప్రాథమిక స్థాయి పరీక్షలన్నీ.. 
వైద్య సిబ్బంది ప్రజల రక్తపోటు, మధుమేహం సంబంధిత పరీక్షలు, బ్లడ్‌ గ్రూప్, రక్తానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ (సీబీపీ), పూర్తిస్థాయి మూ త్ర పరీక్ష (సీయూఈ), ఊపిరితిత్తులు, కాలేయం పనితీరు, 3 నెలల షుగర్‌ టెస్ట్, రక్తంలో యూరియా శాతం, సీరమ్‌ క్రియాటినైన్, ఆల్కలైన్‌ ఫాస్పటేజ్‌ , టోటల్‌ కొలెస్ట్రాల్‌ టెస్టులతో పాటు గుండె పనితీరును ప్రాథమికంగా కనుగొనే ఈసీజీ చేస్తారు. ఇళ్లకు వెళ్లి కొన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఆయా వివరాలు, పరీక్షా ఫలితాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.  

తెలియని జబ్బులు బయటపడే అవకాశం 
18 ఏళ్లు పైబడిన వారిలో కొందరికి సహజంగానే  అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రోడ్డు ప్రమాదం జరగొచ్చు. అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే సమయం ఉండదు. ఈ దృష్ట్యా ఆరోగ్య సమాచారం తక్షణమే అందుబాటులో ఉండేందుకు  ఇలా హెల్త్‌ ప్రొఫైల్‌ను తయారు చేస్తున్నారు.

డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు ఏకీకృత నంబర్‌ ఆధారంగా సంబంధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అప్పటికప్పుడు అంచనా వేసేందుకు సదరు వైద్యుడికి వీలుంటుంది. తద్వారా తక్షణమే వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఇలాంటి చెకప్‌ల వల్ల అప్పటివరకు తెలియకుండా ఉన్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు బయటపడే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు తొలిదశలోనే సంబంధిత జబ్బుకు వైద్యం చేయించుకునేందుకు వీలవుతుంది.

అవసరమైన ఏర్పాట్లలో అధికారులు 
హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీకి అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రస్తుతం జరుగుతున్న పైలెట్‌ ప్రాజెక్టు కోసం పరికరాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వే కొనసాగించేందుకు వీలుగా వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరిలోగా అన్ని జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వేను పూర్తి చేసేలా ప్రణాళిక రచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top