ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా? | Medchal Mother And Sons Incident | Sakshi
Sakshi News home page

ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?

Apr 19 2025 9:59 AM | Updated on Apr 19 2025 1:09 PM

Medchal Mother And Sons Incident

మనవళ్ల కోసం కొనుగోలు చేయగా..

వారిద్దరు చనిపోయినట్లు సమాచారం

 ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతితో సత్తుపల్లిలో విషాదం 

ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 

పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్‌రోడ్‌ టీచర్స్‌ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్‌రెడ్డి(11), అశిష్‌రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. 

కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్‌ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement