‘ఈటల కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం’

Medak Collector Says Possession Of Etela Rajender Illegal Lands - Sakshi

నాలా కన్వర్షన్‌ లేకుండానే షెడ్లు, భవనాల నిర్మాణం 

ఖజానాకు జరిగిన భారీ నష్టాన్ని వసూలు చేస్తాం 

రోడ్డు కోసం అనుమతి లేకుండానే చెట్ల నరికివేత 

బాధ్యులపై అటవీ సంరక్షణ చట్టం కింద చర్యలు 

55.26 ఎకరాల పట్టా భూములపై సైతం విచారణ 

ఈటల, బావమరిది సూరి బెదిరించి కబ్జాలకు పాల్పడ్డారని పలువురి వాంగ్మూలం 

జమున హేచరీస్‌ అధీనంలోని 66 ఎకరాల అసైన్డ్‌ భూములపై మెదక్‌ కలెక్టర్‌  

ఈటల భూకబ్జా వ్యవహారంపై సీఎస్‌కు త్వరలో తుది నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్‌ సంస్థ మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 66.01 ఎకరాల అసైన్డ్‌ భూములను కబ్జా చేసిందని జిల్లా కలెక్టర్‌ హరీశ్‌.. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికలో తేల్చిచెప్పారు. హకీంపేటలోని సర్వే నం.97, అచ్చంపేటలోని సర్వే నం. 77, 78, 79, 80, 81, 82, 103లో ఆక్రమించిన అసైన్డ్‌ భూముల్లో పౌల్ట్రీ షెడ్లు, భవనాలు, రోడ్డును జమున హేచరీస్‌ నిర్మించిందని నిర్ధారించారు. తెలంగాణ అసైన్డ్‌ భూముల(పీఓటీ) చట్టం–1977 కింద సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనల మేరకు ఇతర చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ఈటల భూకబ్జా ఆరోపణలపై శనివారం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఆగమేఘాల మీద విచారణ జరిపి అదేరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రాథమిక నివేదికను పంపించారు. త్వరలో తుది నివేదిక సమర్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆదివారం అనధికారికంగా బయటకు వచ్చిన ప్రాథమిక నివేదికలోని ముఖ్యాంశాలు.. 

ఖజానాకు భారీ నష్టం... 
అసైన్డ్‌ భూముల్లో కచ్చా రోడ్డును వేశారని, దీనికోసం చాలా చెట్లను అనుమతి లేకుండా నరికారని మెదక్‌ డివిజనల్‌ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) నివేదిక సమర్పించారు. నరికివేసిన చెట్ల సంఖ్యను తక్షణమే మదించి అటవీ సంరక్షణ చట్టం–1980 కింద బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ వ్యవసాయేతర భూ మార్పిడి(నాలా) చట్టం–2006 కింద అనుమతి తీసుకోకుండానే పట్టా భూముల్లో జమున హేచరీస్‌ భారీ పౌల్ట్రీ షెడ్డు, ప్లాట్‌ ఫారాలు, భవనాలు, రోడ్డు నిర్మించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. జరిగిన నష్టాన్ని నాలా చట్టంలోని సెక్షన్‌ 4 కింద మదించి రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్‌ యాక్టు) కింద పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు.

హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో జమున హేచరీస్‌ కబ్జా చేసిన ప్రభుత్వ, సీలింగ్‌ అసైన్డ్, పట్టా భూముల జాబితాను పట్టిక రూపంలో జిల్లా కలెక్టర్‌ నివేదికలో పొందుపరిచారు. గ్రామం, సర్వే నంబర్, మొత్తం భూవిస్తీర్ణం, జమున హేచరీస్‌ అధీనంతలోని భూవిస్తీర్ణం, కబ్జా చేసిన భూ విస్తీర్ణం వివరాలను పట్టికలో పొందుపరిచారు. జమునా హేచరీస్‌ అధీనంలోని 55.26 ఎకరాల పట్టా భూములు సైతం విచారణ(ఎగ్జామిషన్‌)లో ఉన్నట్టు ఈ పట్టికలో పేర్కొనడం గమనార్హం. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో జమునా హేచరీస్‌ అధీనంలోని పట్టాభూములు, సీలింగ్‌ అసైన్డ్‌ భూములకు సంబంధించిన నక్షాను సైతం నివేదికతో కలెక్టర్‌ జతచేశారు.  

ఈటల బావమరది సూరి బెదిరింపులు... 
ఈటల రాజేందర్‌ భూ వ్యవహారంలో ఆయన బావమరిది సూరి అలియాస్‌ సురేష్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈటల, సూరి తమను బెదిరించి భూ కబ్జాకు పాల్పడ్డారని పలువురు ఇచ్చిన వాంగ్మూలాన్ని జిల్లా కలెక్టర్‌ నివేదికలో పొందుపరిచారు. మొత్తం డబ్బులు ఇవ్వకుండానే తమ భూములను కబ్జా చేశారని చాకలి బుచ్చమ్మ(1.30 ఎకరాలు), చాకలి పరుశురాం/నాగులు (1.20 ఎకరాలు), బానాపురం రాములు(3 ఎకరాలు), ఎరుకల ఎల్లయ్య(3 ఎకరాలు) స్టేట్‌మెంట్‌ ఇవ్వగా, అసలు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే తమ భూమి లాక్కున్నారని బానాపురం దుర్గయ్య(3 ఎకరాలు), చాకలి లింగయ్య(1.2 ఎకరాలు), చాకలి క్రిష్ణ(1.2 ఎకరాలు) స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. రికార్డుల ప్రకారం ఈ భూములన్నీ అసైన్డ్‌ భూములని కలెక్టర్‌ నిర్ధారించారు. తమ భూములను ఈటల కబ్జా చేసి రోడ్డు, పౌల్ట్రీ షెడ్లు, ప్రహరీ నిర్మించారని కొందరు చెప్పగా, తమ భూముల నుంచి అక్రమంగా మట్టిని తరలించుకుపోయారని మరికొందరు పేర్కొన్నారు.  

20 మంది ఫిర్యాదు... 
బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తమకు 1994లో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్‌ భూములను ఈటల రాజేందర్, ఆయన సంబంధీకులు కబ్జా చేసి పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని, తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని బెదిరించారని చాకలి లింగయ్య, ఇతరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో విచారణ జరిపి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగిందని నివేదకలో కలెక్టర్‌ పేర్కొన్నారు. దాదాపు 20 మంది తమ భూములను జమున హేచరీస్‌ కబ్జా చేసిందని విచారణ సందర్భంగా ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి వాటిని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. 
చదవండి:  సీఎం కేసీఆర్‌ సంచలనం: ఈటల బర్తరఫ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top